గరగపర్రులో ఉద్రిక్తత

26 Jun, 2017 02:01 IST|Sakshi
గరగపర్రులో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసినందుకు తమను సాంఘిక బహిష్కరణ చేశారంటూ దళితులు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం బాధితులను పరామర్శించేందుకు వచ్చి రాత్రి అక్కడే బస చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్, ఏపీ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్,  తదితరులను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్‌ చేశారు.  విషయం తెలియగానే దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు గ్రామానికి తరలివచ్చారు. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు.

వైఎస్సార్‌సీపీ, సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం, మాల మహానాడుతో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు పోలీస్‌ ఆంక్షలను సైతం లెక్కచేయ కుండా పొలాల్లో నుంచి గరగపర్రు చేరుకొని బాధితులను పరామర్శించారు. పరామర్శిం చిన వారిలో వైఎస్సార్‌సీపీ నేతలు సర్రాజు, మేరుగ నాగార్జున తదితరులున్నారు. కాగా,  టీడీపీ ఎమ్మెల్యే వి.వెంకట శివరామరాజు అక్కడకు చేరుకోగా..  నిందితులకు ఎమ్మెల్యే అండగా ఉన్నారంటూ దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలు