రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల వర్షం

23 Mar, 2016 04:14 IST|Sakshi
రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల వర్షం

గడువుకు ముందే లక్ష్య సాధన
ఫిబ్రవరి నాటికే రూ.162.12 కోట్ల ఆదాయం
1,05,415 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్

 
అనంతపురం టౌన్: రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యానికి మించిన ఆదాయంతో దూసుకెళ్తోంది. అనంతపురం రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో 12, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 2015-16 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నెలాఖరుకు ఈ రెండు రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో రూ.153.99 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా ఏకంగా 162.12 కోట్ల ఆదాయ లభించింది. అనంతపురం పరిధిలో రూ.93.28 కోట్లకు రూ.103.69 కోట్లు రాగా, హిందూపురం పరిధిలో రూ.60.71 కోట్లకు రూ.58.43 కోట్లు వచ్చింది. సాధారణంగా లక్ష్యాలను మార్చి 31 నాటికి ఇస్తారు.

ఈ శాఖ లక్ష్యాలను మందుగానే సాధించింది. రాష్ట్ర విభజన, రియల్ వ్యాపారం పెరగడం, ఎక్కువ మంది స్థిరాస్తి పైన పెట్టుబడులకు ఆకర్షితులు కావడంతో క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ శాఖ తొలి నుంచి లక్ష్యాలను మించి ఆదాయం ఆర్జించడం విశేషం. కాగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెండు రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో రూ.173.46 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నా రూ.137.03 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది.

అయితే ఈ సారి మాత్రం లక్ష్యాలను మించి ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి నాటికి అనంతపురం పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 58,042 డాక్యుమెంట్లు, హిందూపురం పరిధిలో 47,373 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఫిబ్రవరి నాటికి సాధించిన లక్ష్యాలను పరిశీలిస్తే ప్రథమ స్థానంలో అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నిలిచింది. ద్వితీయ స్థానంలో హిందూపురం, తృతీయ స్థానంలో అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్నాయి.
 
 లక్ష్య సాధనలో ముందున్నాం
అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో ఆదాయం బాగా సమకూరుతోంది. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ సారి లక్ష్యసాధనలో ముందున్నాం. ఫిబ్రవరి వరకు చూస్తే సుమారు రూ.9 కోట్ల వరకు లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. మార్చి నెలాఖరుకు మరింత ఆదాయం వస్తుంది. - ఎ.గిరికుమార్, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్
 

మరిన్ని వార్తలు