పింఛన్ పంపిణీలో తొక్కిసలాట

13 Nov, 2014 02:35 IST|Sakshi
పింఛన్ పంపిణీలో తొక్కిసలాట

ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం పింఛన్ల పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. పింఛన్ల పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులు, కొత్తగా మరికొన్ని మంజూరయ్యాయని కొంతమంది లబ్ధిదారులు అక్కడికి చేరుకున్నారు. దీంతో కార్యాలయ ఆవరణం పింఛన్ల లబ్ధిదారులతో నిండిపోయింది. ముందుగానే కార్యాలయం చాలా ఇరుగ్గా ఉంటుంది.

కొత్తగా మంజూరైన పింఛన్ లబ్ధిదారుల జాబితాను మేనేజర్ ప్రసాద్ చదివి వినిపిస్తున్న నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా  అక్కడికి వెళ్లారు. దీంతో గందరగోళంగా తయారైంది. ఊపిరాడక పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పింఛన్ మంజూరు కాని వారు మాకెందుకు రాలేదని అధికారులపై వాదనకు దిగారు. చేసేదిలేక మేనేజర్ పాసుపుస్తకాల్వికుండా లోనికి వెళ్లారు.

దీంతో లబ్ధిదారులు ఒక్కసారిగా కార్యాలయ గేట్ తోసుకుంటూ లోనికి పోయారు. ఈ తొక్కిసలాటలో పాపమ్మ అనే వృద్ధురాలు కిందపడింది. ఆమె చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. మరో మృద్ధురాలు సుబ్బమ్మ నడవలేక, కళ్లు సరిగా కనిపించక అక్కడే ఓ మూల కూర్చుని కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. ముందుచూపుగా అధికారులు అక్కడ క్యూ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. విషయాన్ని మేనేజర్ ప్రసాద్ పోలీసులకు చేరవేయడంతో వారు వచ్చి పరిస్థితిని నియంత్రించారు.

 207 కొత్త పింఛన్లు మంజూరు
 ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డులలో కొత్తగా 207 పింఛన్‌లు మంజూరైనట్లు మేనేజర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో 180 వృద్ధులకు, 27 వికలాంగులకు కేటాయించారన్నారు. 

మరిన్ని వార్తలు