నగదు బదిలీలో గోల్‌మాల్..!

5 Jan, 2015 02:52 IST|Sakshi
నగదు బదిలీలో గోల్‌మాల్..!

చిత్తూరులో కొంగారెడ్డిపల్లెకు చెందిన సంజీవరెడ్డి(గ్యాస్ కనెక్షన్ నెంబర్ 28 6509) ఈనెల 3న సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నారు. అదే రోజున ఒక నెల రాయితీ అడ్వాన్సు రూపంలో రూ.568 బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు ఆయన సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారం వచ్చింది.
 
చిత్తూరులో బీవీ రెడ్డి కాలనీ కి చెందిన రామ్మోహన్‌రాజు (గ్యాస్ కనెక్షన్ నెంబర్ 35 09) ఈనెల 3న సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నా రు. ఆ తర్వాత కొద్ది నిముషాలకే ఆయన బ్యాంకు ఖాతాలో గ్యాస్ రాయితీ అడ్వాన్సు రూపంలో రూ.468 జమా చేస్తున్నట్లు సెల్‌ఫోన్‌కు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.
 
చిత్తూరులో మార్కెట్ వీధికి చెందిన ధనశేఖర్(గ్యాస్ కనెక్షన్ నెంబర్ 16292) ఈనెల 3న సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నారు. ఆ వెంటనే ఆయన బ్యాంకు ఖాతాలో గ్యాస్ రాయితీ అడ్వాన్సు రూపంలో రూ.343 జమ అయినట్లు ఎస్‌ఎంఎస్ రూపంలో సెల్‌ఫోన్‌కు సమాచారం వచ్చింది.

గ్యాస్ రాయితీకి వర్తింపజేస్తున్న నగదు బదిలీ పథకంలో గోల్‌మాల్‌కు ఇదో తార్కాణం. అడ్వాన్సు రూపంలో రూ.568 జమ చేస్తామన్న సర్కారు.. అధికశాతం మందికి రాయితీలో రూ.200 వరకు కోత విధిస్తోంది. దీంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పొట్ట కొట్టేందుకే నగదు బదిలీ పథకాన్ని అమలుచేస్తున్నారని మండిపడుతున్నారు.  

 
* నగదు బదిలీ పేరుతో గ్యాస్ రాయితీలో కోత వేస్తున్న ప్రభుత్వం
* తొలి నెల అడ్వాన్సుగా రూ.568 జమ చేస్తామంటూ ప్రకటనలు
* కానీ అధికశాతం లబ్ధిదారులకు రాయితీలో రూ.200కు పైగా కోత
* రాయితీలో భారీగా కోత వేస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన!

సాక్షి ప్రతినిధి, తిరుపతి: పాత కథే పునరావృత్తమవుతోంది..! గ్యాస్ రాయితీకి వర్తింపజేస్తున్న నగదు బదిలీ పథకంలో లోపాలు బహిర్గతమవుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలో రూ.200 వరకు కోత విధిస్తుండ డంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. ప్రజల పొట్టకొట్టి గ్యాస్ రాయితీ భారాన్ని తగ్గించుకోవడానికే నగదు బదిలీ పథకాన్ని అమలుచేస్తున్నారన్న విమర్శలకు ఇది బలం చేకూర్చుతోంది.
 
విపక్షంలో ఉన్నప్పుడు గ్యాస్ రాయితీకి నగదు బదిలీ పథకాన్ని అమలుచేయడం రద్దు చేయాలంటూ ఉద్యమించిన టీడీపీ, బీజేపీలు అధికారంలోకి రాగానే ‘యూ’టర్న్ తీసుకున్నాయి. నగదు బదిలీ పథకమే ముద్దంటున్నాయి. పనిలో పనిగా నవంబర్, 2014 నుంచే గ్యాస్ రాయితీకి నగదు బదిలీని వర్తింపజేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా పథకాన్ని అమలుచేశారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ చేసుకున్న ఏ ఒక్క లబ్ధిదారునికి రాయితీని ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు.

జనవరి 1 నుంచి గ్యాస్ రాయితీకి నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్యాస్ సిలిండర్(14.2 కిలోల) పూర్తి ధర రూ.768.50 కేంద్రం ఇచ్చే రాయితీ రూ.450. నవంబర్ ముందు వరకూ లబ్ధిదారుడు సిలిండర్ డెలివరీ చేసేటపుడు రూ.318.50 చెల్లించేవారు. జూన్ 1 నుంచి నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేస్తున్న నేపథ్యంలో రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్న లబ్ధిదారులకు తొలి నెల అడ్వాన్సు రాయితీ కింద రూ.568 జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

కానీ.. నాలుగు రోజులుగా రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్న లబ్ధిదారుల్లో 90 శాతం మందికిపైగా సగటున రూ.343 మాత్రమే అడ్వాన్సు రాయితీ రూపంలో జమ కావడం గమనార్హం. ప్రభుత్వం చేసిన ప్రకటనకూ.. క్షేత్ర స్థాయిలో అమలు తీరుకూ భారీ వ్యత్యాసం ఉండటంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు.

ఆందోళనలో లబ్ధిదారులు..
నిరుపేద లబ్ధిదారులు ముందే పూర్తి ధర వెచ్చించి సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేయించుకోలేరనే భావనతో ప్రభుత్వం తొలి అడ్వాన్సుగా రాయితీ కింద రూ.568 జమ చేస్తామని పేర్కొంది. కానీ.. అడ్వాన్సును జమ చేయడంలోనే గోల్‌మాల్ చోటుచేసుకోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికీ కొంత మంది లబ్ధిదారులకు ఆధార్‌కార్డులు లేకపోవడంతో గ్యాస్ రాయితీ వారికి దక్కకుండా పోతోంది.

జిల్లాలో 7.20 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కానీ.. ఇప్పటిదాకా 6.79 లక్షల మంది లబ్ధిదారుల గ్యాస్ సర్వీసు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం(సీడింగ్‌ను) పూర్తిచేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే..  అంటే.. నేటికీ 41 వేల మంది లబ్ధిదారుల సీడింగ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. దీన్నెప్పుడు పూర్తిచేస్తారన్న అంశంపై అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడంలేదు.

ఇక ఆధార్ సీడింగ్ సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల అధికశాతం మంది లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కావడం లేదు. లబ్ధిదారుడి గ్యాస్ కనెక్షన్ నంబర్.. ఆధార్ నంబర్.. బ్యాంకు ఖాతా నంబరును అనుసంధానం చేయడంలో తప్పులు దొర్లడం వల్లే ఈ సమస్య ఏర్పడుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

లబ్ధిదారుడు గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోగానే.. ముంబయిలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. ఆ వెంటనే ఆన్‌లైన్‌లో సంబంధిత లబ్ధిదారుని ఖాతాలో రాయితీని జమ చేస్తారు. సీడింగ్‌లో తప్పులు దొర్లడం వల్ల లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ జమ కావడం లేదు. ఈ తప్పులను సరిదిద్దడంపై అధికారులు దృష్టి సారించడం లేదు.
 
నాటి ఉద్యమాలు దేనికో..
యూపీఏ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2013 నుంచి వంట గ్యాస్ లబ్ధిదారులకు రాయితీని నగదు బదిలీ రూపంలో జమ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అప్పట్లోనే లబ్ధిదారుల గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతాలను సీడింగ్ చేశారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ నగదు బదిలీ రూపంలోనే గ్యాస్ రాయితీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. సీడింగ్‌లో లోపాలు ఉండడం వల్ల అధికశాతం మందికి రాయితీ జమ కాకపోవడం.. ఆధార్ లేకపోవడం వల్ల గ్యాస్ రాయితీ దక్కకుండా పోవడంతో ప్రజలు రోడ్డెక్కారు.
 
ఇదే అదునుగా తీసుకున్న టీడీపీ, బీజేపీలు ఆందోళనలు చేపట్టాయి. ప్రజాగ్రహానికి దిగివచ్చిన యూపీఏ సర్కారు డిసెంబర్, 2013 నుంచి నగదు బదిలీ పథకాన్ని రద్దు చేసిన విషయం విదితమే. అప్పట్లో నగదు బదిలీకి వ్యతిరేకంగా ఉద్యమించిన టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పుడు అదే అమలుచేస్తోండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు