అమాత్యా.. ఇదేమి చోద్యం..!

9 Apr, 2016 07:37 IST|Sakshi
అమాత్యా.. ఇదేమి చోద్యం..!

ఓ వైపు గుంటూరు అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీ పెద్దలు
మరో వైపు పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కమిషనర్ నాగలక్ష్మికి మంత్రి ప్రత్తిపాటి క్లాసు
విస్తుపోతున్న నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది
బృందావన్‌గార్డెన్స్‌లో రోడ్డు విస్తరణకు ఆటంకాలు
ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో తమ్ముళ్ల వీరంగం
కార్పొరేషన్‌లో ఖాళీలను పట్టించుకోని వైనం
కృష్ణా పుష్కరాలకు పైసా విడుదల చేయని ప్రభుత్వం
ఇష్టారాజ్యంగా జన్మభూమి కమిటీలు

 
సాక్షి, గుంటూరు  : రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు ‘ చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్న’ నానుడిని జ్ఞప్తికి తెస్తున్నాయి...గుంటూరు నగరాభివృద్ధిని తెలుగు తమ్ముళ్లు, టీడీపీ ప్రజాప్రతినిధులు అడుగడుగునా అడ్డుకుంటుండగా, ఆయన మాత్రం నగర కమిషనర్, ఐఏఎస్ అధికారి నాగలక్ష్మికి క్లాసు తీసుకోవడంపై విమర్శలు వినవస్తున్నాయి. నగరంలో రోడ్లు విస్తరణ చేపట్టి అప్పటి కమిషనర్ కృష్ణబాబు ఎంతో పేరు తెచ్చుకున్నారని మీరు సైతం రోడ్లు విస్తరణ పూర్తిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని, అలాగే తమవాళ్లు ఎవరైనా అడ్డుకుంటే తనకు చెప్పాలంటూ మూడు రోజుల కిందట నగర కమిషనర్ నాగలక్ష్మికి మంత్రి క్లాస్ తీసుకోవడం  హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు గుంటూరు నగరపాలక సంస్థ ఉద్యోగుల నుంచి వినవస్తున్నాయి.


నగరంలోని బృందావన్‌గార్డెన్స్ రోడ్డును మాస్టర్‌ప్లాన్ ప్రకారం 80 అడుగులుగా విస్తరించాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్న కొంతమంది అధికార పార్టీ పెద్దలకు సంబంధించిన గృహాలు, స్థలాలు రోడ్డు విస్తరణలో పోతాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు, తమ్ముళ్లు మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా 60 అడుగులు మాత్రమే విస్తరణ చేపట్టాలని కమిషనర్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. అదేవిధంగా జేకేసీ కళాశాల రోడ్డు నుంచి తక్కెళ్ళపాడు రోడ్డు విస్తరణలో పార్టీకి చెందిన ప్రముఖ బిల్డరుకు సంబంధించిన స్థలం కోల్పోతున్నారు. దీంతో కేవలం ఒకవైపు మాత్రమే రోడ్డు విస్తరణ చేపట్టాలని ఒత్తిడి తీసుకువస్తూ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తున్నారు.


 జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం ...
అదే సమయంలో నగరాభివృద్ధికి అవసరమైన నిధులను ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన దాఖలాలు లేవు. కేవలం ప్రజల పన్నులతోనే నగరంలో కమిషనర్ అభివృద్ధి పనులు చేపట్టాల్సి వస్తుంది. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన రూ. 540 కోట్లుకు సంబంధించి భూగర్భ డ్రైనేజీ పనులు సైతం ఆలస్యం అవుతున్నాయి. అలాగే నగరాభివృద్ధికి సంబంధించి అటు ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. అదేసమయంలో సంక్షేమ పథకాల అమల్లో జన్మభూమి కమిటీల అవినీతికి అంతులేకుండా పోతుంది. లబ్ధిదారులను ఎంపిక చేయడంలో తమ్ముళ్లు చేతివాటం చూపిస్తున్నారు.


 కమిషనర్‌కు తమ్ముళ్ల హెచ్చరికలు..
ఇదిలా ఉంటే నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల అంశం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటిని పాటిస్తున్న కమిషనర్‌పై  టీడీపీ పెద్దలు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా నగరం మొత్తం ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాటిని వెంటనే తొలగించాలని కమిషనర్  ఆదేశాలు జారీచేశారు. అయితే తమ్ముళ్లు మాత్రం ఫ్లెక్సీలు తొలగిస్తే ఊరుకొనేది లేదని కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవసరమైతే తెనాలి పట్టణానికి వెళుతున్న నీటిని గుంటూరుకు మళ్లించకుండా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీచేయడంతో ఆమె ఆశ్చర్యపోయారు.


 నగరపాలక సంస్థలో సిబ్బంది కొరత..
 ఇక నగర పాలకసంస్థలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది లేరు. అదనపు కమిషనర్ పోస్టు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉంది. పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాల్లో సైతం పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు.  ప్రభుత్వం భర్తీ చేయకపోయినా మంత్రి పుల్లారావు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అధికారులు లేకపోవడంతో ప్రతి చిన్న పనిని కమిషనర్ స్వయంగా చూడాల్సి రావడంతో అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని నగర పాలక సంస్థ అధికారులు చెబుతున్నారు.
 
 
 కార్పొరేషన్ నిధులతోనే పనులు...
 కృష్ణా పుష్కరాలకు సంబంధించి నగరంలో రోడ్లవిస్తరణ, నగర సుందరీకరణ పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా మంజూరు చేయలేదు.  కార్పొరేషన్ నిధులతోనే పనులు చేపట్టేందుకు కమిషనర్ ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. ఇందులో సైతం తమ్ముళ్లు టెండర్లు దక్కించుకొని నాసిరకంగా పనులు చేస్తూ ఇంజినీరింగ్ అధికారులపై పెత్తనం చేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా  పట్టించుకోని మంత్రి, ప్రజాప్రతినిధులు నగర ప్రజలపై ప్రేమ ఉన్నట్లు, నగరాభివృద్ధికి అధికారులు కృషిచేయడం లేదన్న విధంగా మాట్లాడడంపై కార్పొరేషన్ సిబ్బంది, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు