పౌరసరఫరాలశాఖపై విజిలెన్స్

7 Dec, 2013 05:17 IST|Sakshi

నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని పౌరసరఫరాలశాఖపై విజిలెన్స్ దృష్టి సారించింది. పౌరసరఫరాలశాఖ అక్రమాల గుట్టురట్టు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మూడేళ్లుగా ఆశాఖలో అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్‌లో కదలిక వచ్చింది. పౌరసరఫరాలశాఖకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తోంది. ముఖ్యంగా బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోవడం, నీలి కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలడం, మండల స్టాక్‌పాయింట్లలో జరుగుతున్న అక్రమాలు, గ్యాస్ రీఫిల్లింగ్, ప్రైవేట్ ఉద్యోగుల పాత్ర వంటి వాటిపై లోతుగా విజిలెన్స్ విచారిస్తున్నట్టు తెలిసింది.
 చౌక దుకాణాల్లో బినామీల దందా...
 జిల్లాలో బినామీ రేషన్ డీలర్లు రాజ్యమేలుతున్నారు. వీరికి రాజకీయ, అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో డీలర్ల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నెల్లూరు నగరంలో సగానికి పైగా బినామీ రేషన్‌డీలర్లు షాపులు నడుపుతున్నట్టు తెలిసింది. దీనికి నెల్లూరు తహశీల్దార్ కార్యాలయం వేదికగా మారింది. రేషన్‌సరుకుల అలాట్‌మెంట్‌లో భారీ అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి.
 కేటాయింపు ఇలా...
 జిల్లాలో మొత్తం 1872 మంది రేషన్‌డీలర్లు ఉన్నారు. వీరికి పౌరసరఫరాలశాఖ కార్యాలయం నుంచి రేషన్ సరుకుల కేటాయింపు తహశీల్దార్ కార్యాలయాలకు
 
 పంపుతారు. దీని ప్రకారం డీలర్లు మీ సేవా కేంద్రాల్లో డీడీల రూపంలో డబ్బు చెల్లిస్తారు. తమకు కేటాయించిన ప్రకారం మండల స్టాక్ పాయింట్ల వద్ద సరుకులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగడంలేదు. బినామీ డీలర్లతో తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే పౌరసరఫరాలశాఖ డిప్యూటీ తహశీల్దార్ కుమ్మక్కై కేటాయింపుల్లో మోసాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా ఏ అధికారి అటువైపు తొంగిచూడకపోవడం గమనార్హం.
 బినామీల కనుసన్నల్లో..
 కొత్తరేషన్ కార్డుల మంజూరు, రేషన్ బియ్యం తరలింపు, ఏ షాపుకు ఎంత అలాట్‌మెంట్, కోత, ఏ అధికారికి ఎంత సొమ్ము ముట్టజెప్పాలనే విషయాలన్నీ బినామీ డీలర్ల కనుసన్నల్లో జరుగుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ఏ అధికారి బినామీ డీలర్ల జోలికి వెళ్లేందుకు సాహసించరు. అలాగే గిరిజన కులస్తులు (చల్లా యానాదులు)కు సంబంధించిన వైఏపీ కార్డులను సైతం రాబట్టుకొని, కార్డులకు సంబంధించిన కోటాను కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద బినామీ డీలర్లు అక్రమాలకు అడ్డుకట్టవేయలేరా?
 దాడులు నిల్.. కనెక్షన్లు ఫుల్...
 దాడులు నిల్.. కనెక్షన్లు ఫుల్ అన్న చందంగా పౌరసరఫరాలశాఖ మారింది. జిల్లాలోని పౌరసరఫరాలశాఖలో డీఎస్‌ఓతోపాటు డీఎం, ఐదుగురు ఏఎస్‌ఓలు, 18 మంది సీఎస్‌డీటీలు పని చేస్తున్నారు. అయితే ఎక్కడా దాడులు చేసిన దాఖలాలు కనిపించవు. ఒక వేళ ఎక్కడైనా దాడులు జరిపినా వారిపై కేసులు ఉండవు. అందినకాడికి దోచుకొని అక్రమార్కులకు అండగా నిలవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా