పింఛన్లకు ‘పచ్చ’ చిక్కులు

12 Sep, 2015 03:33 IST|Sakshi
పింఛన్లకు ‘పచ్చ’ చిక్కులు

కడప కార్పొరేషన్ :  తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం కాస్తా వృద్ధాప్య, వితంతు, వికలాంగ  పింఛ న్ల మంజూరుపై పడింది. ఆ పార్టీ కడప నియోజకవర్గ ఇన్‌చార్జిని ఇప్పటి వరకూ ప్రకటించక పోవడంతో.. ఆ నియోజకవర్గంలో పింఛ న్ల మంజూరు ప్రక్రియ ఆగిపోయింది. ప్రభుత్వం కేటాయించిన వెయ్యి పింఛన్లు నిలిచిపోయాయి. టీడీపీ ఇన్‌చార్జిని ప్రకటిస్తే తప్ప పింఛన్లు మంజూరయ్యేలా కనిపించడం లేదు. పింఛన్ల మంజూరుకు, టీడీపీ ఇన్‌చార్జికి సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా?... ఈ కథనం చదివితే మీకే తెలుస్తుంది.

 టీడీపీ నాయకుల సిఫార్సులే ప్రధానం..
 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలచే ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులను పక్కన బెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులతో జన్మభూమి కమిటీలు వేసింది. ప్రభుత్వ పథకాల మంజూరులో ఈ కమిటీల నిర్ణయమే కీలకంగా మారింది. పింఛన్ల మంజూరుతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రుణాలు, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం తదితర అన్నింటిలోనూ ఈ కమిటీలదే పెత్తనంగా మారింది. వీరు ఎవరిని సిఫారసు చేస్తే వారికే పింఛన్లు, రుణాలు మంజూరవుతున్నాయి.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో నియోజక వర్గానికి వెయ్యి పింఛన్ల చొప్పున మంజూరు చేసింది. నిజమైన అర్హులకు పింఛన్లు అందాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే.. అధికారుల వద్దనున్న సమాచారం ప్రకారం అర్హులై ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకొని ఉంటారో, వారికి పింఛన్లు మంజూరు చేయవచ్చు. కానీ టీడీపీ నాయకుల సమ్మతం మేరకే ఈ ప్రక్రియ జరగాలని ప్రభుత్వం భావిస్తుండటంతో సమస్యలు వస్తున్నాయి.

 అధికారులూ.. జీ హుజూర్..
 జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొత్త పింఛన్లను మంజూరు చేసి పింపిణీ కూడా పూర్తి చేశారు. కడపలో మాత్రమే ఇది ప్రారంభం కాలేదు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఆయన సంతకం లేనిదే ఎవరికీ పింఛన్లు మంజూరు ఇవ్వలేమని భావించి అధికారులు కడపకు పింఛన్లు మంజూరు చేయకుండా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూసి పింఛన్‌దారులు ఔరా...అని ముక్కున వేలేసుకొంటున్నారు.

 అంతు లేని జాప్యం:
 కడపలో ఇప్పటి వరకు 19154 పింఛన్లు ఇస్తుండగా, కొత్తగా 12,500 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు సరిగా లేదనో, సదరం సర్టిఫికెట్ లేదనో, పేర్లు మ్యాచ్(సరి) కాలేదనో కారణాలతో ఏడు వేల మందిని అనర్హులుగా గుర్తించారు. 5500 మందిని అర్హులుగా గుర్తించి ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉంచారు. వీరిలో సీనియారిటీ ప్రాతిపదికన వెయ్యి మందిని ఎంపిక చేస్తే సరిపోతుంది. కానీ మొత్తం దరఖాస్తు చేసుకొన్న వారిలో అర్హతతో సంబంధం లేకుండా ఎవరైతే టీడీపీకి అనుకూలంగా ఉంటారో వారికే పింఛన్లు మంజూరు చేసేందుకే టీడీపీ ఇన్‌చార్జి లేరని, జన్మభూమి కమిటీలని కాలయాపన చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

 టీడీపీలో అంతర్గత పోరు:
 నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి విషయమై తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. ఇన్‌చార్జి బరిలో మాజీ మంత్రి ఖలీల్‌బాషా, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దుర్గా ప్రసాద్‌రావు ఉన్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం ఎప్పుడు కొలిక్కి తెస్తుందో, ఎప్పుడు పింఛన్ మంజూరు చేస్తుందోనని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు