కృష్ణమ్మ పరవళ్లు! | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ పరవళ్లు!

Published Sat, Sep 12 2015 3:36 AM

కృష్ణమ్మ పరవళ్లు!

సాక్షి, హైదరాబాద్/జూరాల: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కొద్దిరోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు స్థానిక ప్రవాహాలు తోడవ్వడంతో ప్రాజెక్టుల్లో నీటి ఉధృతి కొనసాగుతోంది. కృష్ణమ్మకు తుంగభద్ర కూడా తోడవ్వడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. మూడు రోజుల్లోనే శ్రీశైలానికి సుమారు 11 టీఎంసీల నీరు రాగా, 57 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఇక ఎగువ కర్ణాటకలోని నారాయణపూర్, రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టులు దాదాపు నిండుకున్నాయి.

నారాయణ్‌పూర్ ప్రాజెక్టు వద్ద రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాల నుంచి నేడో, రేపో గేట్లను ఎత్తే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
 
శ్రీశైలంలోకి 11 టీఎంసీల నీరు..
నాలుగు రోజులుగా తుంగభద్ర నదిలో కొనసాగుతున్న వరద ఉధృతి కారణంగా సుంకేశుల ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలంలోకి భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. తుంగభద్ర నది ఉధృతికి కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాలు కూడా తోడవ్వడంతో శ్రీశైలంలో ప్రవాహాలు మరింత పెరిగాయి. గురువారం 31 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా శుక్రవారం నాటికిఇది 57 వేల క్యూసెక్కులకు చేరింది.

గురువారం 31.98 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ శుక్రవారం ఉదయానికి 35.68 టీఎంసీలకు.. సాయంత్రానికి 37.65 టీఎంసీలకు పెరిగింది. దీంతో నాలుగు రోజుల్లో ప్రాజెక్టులోకి 11 టీఎంసీల మేర నీరు చేరిన ట్లైంది. ప్రాజెక్టు పరీవాహకంలో వర్షాలు కొనసాగుతుండటం, ఎగువ నుంచి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉండటంతో నీటి నిల్వ మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 885 అడుగుల నీటి మట్టానికిగానూ 815.5 అడుగుల వద్ద నీరు ఉంది. మరో 20 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరితే విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
 
నిండుగా జూరాల, నారాయణపూర్..
ఎగువ కృష్ణా బేసిన్‌లో విసృ్తతంగా కురుస్తున్న వర్షాలకు నారాయణపూర్, జూరాలకు ప్రవాహాలు పెరుగుతున్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.12 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 18,363 క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండటంతో ప్రాజెక్టు దాదాపు నిండింది. శనివారంతో పూర్తిగా నిండే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు నుంచి దిగువకు 13,445 క్యూసెక్కుల నీటి ప్రవాహాలున్నాయి.

ఇవన్నీ జూరాలలో వచ్చి చేరడంతో ఆ ప్రాజెక్టు సైతం శనివారంతో పూర్తిగా నిండనుంది. ప్రస్తుతం జూరాలలో 11.94 టీఎంసీల నీటి నిల్వకుగానూ 11.79 టీఎంసీల నిల్వ ఉంది. జూరాల రిజర్వాయర్‌కు పరీవాహక ప్రాంతం నుంచి 34,150 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో విద్యుదుత్పత్తికి 32 వేల క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. నాలుగు టర్బైన్ల సాయంతో 156 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

నారాయణపూర్ నిండటంతో ఇప్పటికే జూరాల నిండేందుకు సిద్ధంగా ఉండటంతో అక్కడి నుంచి నీటి విడుదలకు పూనుకున్నా ఆ నీరంతా శ్రీశైలానికి చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుత తుంగభద్ర నుంచి వస్తున్న ప్రవాహాలకు ఎగువ కృష్ణా ప్రవాహాలు తోడైతే శ్రీశైలంలో భారీగా నీరు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
20 నుంచి దిగువ జూరాలలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా ఈ నెల 20 నుంచి విద్యుదుత్పత్తి చేయనున్నట్టు జెన్‌కో డెరైక్టర్ వెంకటరాజం చెప్పారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని జూరాల, మూలమళ్ల గ్రామాల శివారులో దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణాల్ని ఆయన పరిశీలించారు.

Advertisement
Advertisement