ప్రకృతి సీమకు పవన మార్గం

28 May, 2016 01:28 IST|Sakshi

త్వరలో అరకులోయకు హెలిటూర్
వుడా పార్క్ టు కైలాసగిరికి కూడా..

 

విశాఖపట్నం :  హెలికాప్టర్‌లో విశాఖ చూడాలని ఉందా? విశాఖ నుంచి అరకులోయ, సాగరతీరం నుంచి కైలాసగిరికి గాల్లో విహరించాలని ఉందా? అయితే ఆ ముచ్చట త్వరలోనే తీరనుంది. చేతిలో సొమ్ముంటే చాలు.. గాల్లో తేలిపోవచ్చు.. సుందర విశాఖను వీక్షించవచ్చు..! పర్యాటకరంగంలో విశాఖకు ఎంతో ప్రత్యేకత ఉంది. తన అందచందాలతో దేశ విదేశాల్లోని పర్యాటకులను ఎంతగానో ఆక ర్షిస్తోంది. ఏటా అరకోటికి పైగా పర్యాటక ప్రియులు విశాఖ నగరంతో పాటు మన్యంలోని అరకు అందాలను చూడడానికి వస్తుంటారు. వీరి సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పర్వత శిఖరాలపై ఉన్న కేదార్‌నాథ్, అమర్‌నాథ్, వైష్ణోదేవి వంటి పుణ్యక్షేత్రాల కు హెలికాప్టర్‌లో భక్తులను తీసుకెళ్లడంలో అనుభవం ఉన్న స్కై చాపర్స్ లాజిస్టిక్స్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ విశాఖలో హెలిటూరిజానికి ముందుకొచ్చింది.


ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. హెలి టూరిజానికి డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి కూడా లభించింది.  ఈ సంస్థ తొలిదశలో వుడా పార్కు నుంచి కైలాసగిరికి హెలికాప్టర్ నడపనుంది. ఇది పర్యాటకులను, ఆసక్తి ఉన్న వారిని ఎక్కించుకుని వుడా పార్కు నుంచి సాగరతీరం మీదుగా ఐదు నిమిషాల పాటు విహరిస్తూ కైలాసగిరిపై ల్యాండ్ అవుతుంది. కైలాసగిరిపై అందచందాలను చూశాక తిరిగి వుడా పార్కుకు తీసుకొస్తుంది. ఇందుకోసం వుడా పార్కు, కైలాసగిరిపై ల్యాండింగు, టేకాఫ్‌ల కోసం హెలిప్యాడ్‌లను సమకూర్చమని ‘స్కై చాపర్స్’ వుడాను కోరింది. వుడా పార్కులో గతంలో ఉన్న ఎంజీఎం చిల్డ్రన్ వరల్డ్ స్థలాన్ని హెలిప్యాడ్‌కు ఖరారు చేశారు. దీనిపై నేవీ అధికారులకు, డీజీసీఏకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం లేఖ రాశారు. అంతేకాదు.. హెలిటూరిజం సర్వీసు ప్రారంభమైతే ఒక్కొక్కరికి రూ.2,500 టిక్కెట్ ధర నిర్ణయించే అవకాశం ఉంది.

 
అరకులోయకు కూడా..

మరోవైపు విశాఖ నుంచి అరకులోయకు కూడా హెలికాప్టర్‌ను నడపనున్నారు. విశాఖలో బయల్దేరే హెలికాప్టర్ 20 నిమిషాల్లో అరకు చేరుకుంటుంది. పర్యాటకులు అక్కడ అందుబాటులో ఉన్న పర్యాటక ప్రాంతాలను చూసొచ్చాక విశాఖకు తీసుకొస్తుంది. అరకు టూర్‌కు ఒక్కొక్కరికి టిక్కెట్ ధర రూ.4000 నుంచి 4500 వసూలు చేయనున్నారు. ఒక్కో హెలికాప్టర్‌లో గరిష్టంగా ఐదుగురు కూర్చునే వీలుంటుంది.

 

జులై మొదటి వారంలో..
విశాఖలో హెలి టూరిజాన్ని జులై మొదటి వారంలో ప్రారంభించాలనుకుంటున్నాం. ఇందుకవసరమైన ప్రక్రియ పూర్తవుతోంది. ఇప్పటికే సుమారు రూ.13 కోట్లతో కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేశాం. ప్రస్తుతానికి ఒక హెలికాప్టర్‌తో సర్వీసులు నడుపుతాం. అవసరమైతో మరొకటి కొంటాం. వుడా పార్క్ నుంచి కైలాసగిరికి, అలాగే ఆరకులోయకు పర్యాటకులను తిప్పుతాం. అరకులోయకు రోజూ నడపాలా? లేక వీకెండ్లలో నడపాలా? అన్నది పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. పర్యాటకులు, విశాఖ వాసుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం.

చంద్రశేఖర్, బిజినెస్ డెవలప్‌మెంట్ డెరైక్టర్, స్కైచాపర్స్.

 

 

మరిన్ని వార్తలు