కదలిక ఖాయం

11 Jun, 2014 02:26 IST|Sakshi

ల్లో భారీ మార్పులకు అవకాశం
జిల్లా నేతలను సంప్రదిస్తున్న అధికార గణం

 
అనంతపురం :
 రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో జిల్లాలో పలువురు అధికారులకు స్థానచలనం తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని తిష్టవేసిన వారిని పంపించడానికి తెలుగు తమ్ముళ్లు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇతర విషయాల్లో ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్న ‘తమ్ముళ్లు’.. అధికారుల బదిలీల విషయంలో మాత్రం ఏకతాటిపై నిలబడినట్లు తెలుస్తోంది. తమకు నచ్చని వారిని జిల్లా నుంచి పంపించడానికి రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతతో పాటు టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసులతో తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొందరు అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి మానసికంగా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు, గ్రామీణ నీటి సరఫరా, ఎక్సైజ్, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల్లో అధికారులను బదిలీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులకు సైతం స్థాన చలనం తప్పదన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఖాయమని తొలి నుంచి ఆశలు పెట్టుకున్న ఓ నాయకుడు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. ఎలాగైనా రీకౌంటింగ్ పెట్టి తాను గెలిచేలా చూడాలంటూ ఆ నేత జిల్లా అధికారులకు భారీ ఆఫర్లు ఇచ్చారు. ఈ విషయంలో సహకరించాలని ఓ పోలీసు ఉన్నతాధికారిని సైతం కోరారు. అయితే.. ఆయన ససేమిరా అనడాన్ని జీర్ణించుకోలేని ఆ నేత ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సదరు పోలీసు అధికారిని బదిలీ చేయించాలని పంతం పట్టినట్లు తెలిసింది.


 కదిరిలో టీడీపీ నాయకుడికి రైట్‌హ్యాండ్‌లా పనిచేసే ఓ గ్యాస్ ఏజెన్సీ డీలర్ దాచి ఉంచిన అక్రమ గ్యాస్ సిలిండర్లను ఎన్నికలకు ముందు రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఆ విషయంలో చూసీచూడనట్లు వెళ్లాలని స్థానిక తహశీల్దార్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులపై ఆ నేత ఒత్తిడి తెచ్చారు. వారు ఖాతరు చేయలేదు. దీంతో ప్రస్తుతం వారిని బదిలీ చేయించే పనిలో ఆ నేత నిమగ్నమైనట్లు సమాచారం. మంత్రి పరిటాల సునీత ద్వారా బదిలీకి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకుల పైరవీలకు అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం ఆ ఉన్నతాధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేసి.. తమకు అనుకూలమైన అధికారిని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, టీడీపీ నేతలకు ఆ అవకాశం ఇవ్వడానికి ఇష్టపడని ఆ ఉన్నతాధికారే స్వయంగా బదిలీపై వెళ్లిపోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. కాంగ్రెస్ హయాంలో అప్పటి మంత్రి రఘువీరారెడ్డికి తలలో నాలుకలా మెలిగిన సమాచార, పౌర సంబంధాల శాఖలోని ఓ అధికారి బదిలీ తప్పదన్న ప్రచారం సాగుతోంది. రఘువీరా అండదండలతో ఆ అధికారి అప్పట్లో ఎవర్నీ లెక్కచేయకుండా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ఇప్పటికీ ఆ అధికారి నిత్యం రఘువీరాకు టచ్‌లో ఉంటూ.. ఆయన సూచనల మేరకే పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎలాగైనా బదిలీ చేయించాలని టీడీపీ నాయకులు కంకణం కట్టుకున్నట్లు తెలిసింది. ఆయన మాత్రం తన బదిలీని నిలుపుదల చేయించుకోవడానికి రఘువీరా దౌత్యంతో మంత్రి పరిటాల సునీతను ప్రసన్నం చేసుకుంటున్నట్లు సమాచారం.
 
 

మరిన్ని వార్తలు