హోరెత్తించిన రైతు రంకె

26 Sep, 2013 02:34 IST|Sakshi

సాక్షి, అనంతపురం / కలెక్టరేట్, న్యూస్‌లైన్:  ‘రాష్ట్రాన్ని విభజిస్తే అధికంగా నష్టపోయేది రైతులే. కావున అన్నదాతలు ఉద్యమానికి నాయకత్వం వహించి పోరాడాలి. అప్పుడే విభజనకు బ్రేక్ పడుతుంద’ని జిల్లా సంయుక్త జేఏసీ చైర్మన్, డీఆర్వో హేమసాగర్ పిలుపునిచ్చారు. నగరంలో బుధవారం నిర్వహించిన ‘అనంత రైతు రంకె’ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. మరీ ముఖ్యంగా కరువు కాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లా మరింత వెనకబడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతంలో ఉన్న వేర్పాటువాదులు కృష్ణా, గోదావరి జలాలను అడ్డుకుంటారన్నారు.
 
 ‘జిల్లాలో 2004 నుంచి ఇప్పటి వరకు అప్పుల బాధ తాళలేక 763 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సమైక్య రాష్ట్రంలోనే పరిస్థితి ఇలా ఉంది. రాష్ట్రాన్ని విభజిస్తే సాగు, తాగునీటి ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి.
 
 పేదవాడు మరింత పేదవాడుగా మారిపోతాడు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందకుండా పోతాయి. విభజన అనేది విష సంస్కృతి. ఆనాడు బ్రిటీష్ సామ్రాజ్యవాదులు పెంచి పోషించిన ఈ సంస్కృతిని నేడు కొందరు వంట బట్టించుకున్నారు. వారి వల్లే రాష్ట్ర విభజన జరుగుతోంది. దాన్ని ప్రోత్సహిస్తే దేశ వ్యాప్తంగా పాకుతుంది. కావున  సమైక్య రాష్ట్ర పరిరక్షణకు రైతులు నడుం బిగించాల’ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీమాంధ్ర ఉద్యాన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇన్ని రోజులు పెన్నులు పట్టిన వారు ఉద్యమం చేస్తున్నారు.. ఇప్పుడు హలాలు, పలుగు, పార పట్టిన వారూ ఉద్యమంలోకి రావడం శుభపరిణామమని అన్నారు.
 
 కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు కరుణాకర్ శర్మ, పశు సంవర్ధక శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు నగేష్, పట్టుపరిశ్రమ శాఖ జేడీ అరుణకుమారి, డీపీఆర్వో తిమ్మప్ప, వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి, పశుసంవర్ధకశాఖ డీడీ జయకుమార్, వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుప్రకాష్, కర్నూలు డ్వామా పీడీ హరినాథరెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగిని పద్మావతి, ఎంపీడీఓల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, పశుసంవర్ధక శాఖ జేఏసీ నాయకులు రత్నకుమార్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.        
 
 ఉర్రూతలూగించిన కళాకారులు
 ‘అనంత రైతు రంకె’లో కళాకారులు ఆట పాటలతో ఉర్రూతలూగించారు. ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా... సమైక్యాంధ్ర నిలబెట్టు తెలుగోడా’ అంటూ ఉద్యమకారుల్లో ఉత్సాహం నింపారు. శ్రీ నృత్యకళా నిలయం డ్యాన్స్ మాస్టర్ సంధ్యామూర్తి శిష్యురాళ్లు కావ్య, సాయిసింధు, దివ్య, సాయిలక్ష్మి, రితిక్, మౌనికల గణపతి ప్రార్థన ఆకట్టుకుంది. శ్రీనివాస నృత్యకళానికేతన్ డ్యాన్స్ మాస్టర్ విజయ్‌కుమార్, శిష్యురాలు కృతి అయ్యంగార్, కరిష్మా కల్చరల్ అసోసియేషన్, మక్బుల్ డ్యాన్స్ అకాడమీ చిన్నారులు వివిధ పాటలకు నృత్యాలు చేసి అలరించారు. నెల్లూరు నుంచి వచ్చిన అన్నదాత మణి ఆట్టుకునేలా ప్రసంగించారు. దిగ్విజయ్, కేసీఆర్, టీఆర్‌ఎస్, యూపీఏ సర్కార్‌పై ఆయన విసిరిన ఛలోక్తులు రైతులను ఆకట్టుకున్నాయి.
 

మరిన్ని వార్తలు