తోటపల్లి వెలగాలి

25 Mar, 2019 12:46 IST|Sakshi
తోటపల్లి ప్రాజెక్టు 

తోటపల్లి ప్రాజెక్టు రైతాంగం ఆకాంక్ష

పూర్తికాని పిల్ల కాలువల నిర్మాణం

లక్షల్లో ఇస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలు

పెండింగ్‌ పనుల పూర్తికి జగన్‌ హామీ

గరుగుబిల్లి (కురుపాం): తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2003లో శంకుస్థాపన చేశారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక జలయజ్ఞంలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టుకు పాలనా అనుమతులను తీసుకొచ్చి పనులను వేగవంతం చేశారు. స్పిల్‌వే, తోటపల్లి కుడిప్రధాన హెడ్‌ స్లూయిస్, కుడికాలువ నిర్మాణ పనుల్ని 90 శాతం వరకు పూర్తి చేశారు. వైఎస్‌ ఆకస్మిక మరణంతో ప్రాజెక్టు పనులు మందగించాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కుడికాలువ కల్వర్టు పనులు, స్ట్రక్చర్‌ పనులను పూర్తిచేసి 2015 సెప్టెంబర్‌ 10న సాగునీటిని సరఫరా ప్రారంభించారు. 

కుడి ప్రధాన కాలువ నిర్మాణం ఇలా..
గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర నుంచి గుర్ల మండలం గడి గెడ్డ వరకు 117.7 కిలోమీటర్ల కుడి ప్రధాన కాలువ నిర్మాణం చేపట్టారు. ఇందులో నాలుగు బ్రాంచ్‌ కాలువలు, 29 డిస్ట్రిబ్యూటర్లు, 220 స్ట్రక్చర్లను నిర్మించారు. కుడి ప్రధాన కాలువ ద్వారా విజయనగరం జిల్లాలోని 10 మండలాల్లో 155 గ్రామాలకు 62,055 ఎకరాలకు, శ్రీకాకుళం జిల్లాలోని ఏడు మండలాల్లోని 132 గ్రామాల్లో 57,945 ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యం.

అంచనాలు మించిన వ్యయం
సకాలంలో నిర్వాసితుల సమస్యలు, భూసేకరణ తదితర సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అంచనా వ్యయాన్ని రూ.772.64 కోట్లకు పెంచారు. తరువాత అంచనా వ్యయం రూ.1124 కోట్లకు చేరింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌ పనుల నిర్వాహణకు విడుదల చేసిన నిధులు కేవలం రూ.65 కోట్లే. ఈ కొద్దిపాటి నిధులను విడుదల చేసి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని.. రైతులను ఆదుకున్నాం అంటూ ప్రసంగాలు చేస్తుంటే రైతులు విస్తుపోతున్నారు. ప్రాజెక్టు అసంపూర్తి పనుల పూర్తికి ఇంకా రూ.300 కోట్లు విడుదల చేయాల్సి ఉందని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. 

చెప్పేది లక్షల్లో.. ఇచ్చేది వేలల్లో
కుడి ప్రధాన కాలువ నిర్మాణం మినహా పిల్ల కాలువలు నిర్మించకపోవడంతో  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 50 వేల ఎకరాలకు మించి సరఫరా కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. పిల్లకాలువ నిర్మాణానికి ఇంకా 200 ఎకరాల భూసేకరణ జరగాలని అధికారులు చెబుతున్నారు. దీంతో పంట పొలాలకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. 


నిర్వాసితుల గోడు
ప్రాజెక్టు నిర్మాణంలో 21 గ్రామాలు ముంపు గ్రామాలుగా ప్రకటించగా 10 గ్రామాలకు పునరావాసం కల్పించారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేశామని చెప్పుకోవడం తప్ప నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం లేదని ఈ ప్రాంతీయులు ఆరోపిస్తున్నారు. గరుగుబిల్లి మండలంలో సుంకి, నందివానివలస, జియ్యమ్మవలస మండలం బాసంగి, బాసంగి గదబవలస బిత్రపాడు, కొమరాడ మండలం కళ్లికోట, దుగ్గి, గుణానపురం, పార్వతీపురం మండలం పిన్నింటి రామినాయుడువలస గ్రామాలకు ఇంతవరకు పునరావాసం కల్పించలేదు. 


రైతులకు జగన్‌ భరోసా
ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా గరుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్టును వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సందర్శించిన సందర్భంగా ఈ ప్రాంత రైతులు ప్రాజెక్టు పరిస్థితిని వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంతోపాటు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మాటిస్తే తప్పరు
వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా జగన్‌మోహన్‌ రెడ్డి కూడా రైతులకు మాట ఇస్తే వెనుకడుగు వేయరు. పంటల సీజన్‌ వచ్చిందంటే రైతుల ఖాతాలో పెట్టుబడి నిధి కింద రూ.12,500 జమ చేస్తామని ప్రకటించడం హర్షణీయం. రైతులకు ఉచిత విద్యుత్, వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించడం ముదావహం. 
– మండల శంకరరావు, ఎంపీటీసీ, తోటపల్లి


కుడికాలువ నీరందించాలి
ఈ ప్రాంతంలోనే తోటపల్లి ప్రాజెక్టు ఉన్నా కొత్తగా నిర్మించిన కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందడం లేదు. మండల పరిధిలోని గ్రామాల వెంబడి సాగునీరు సరఫరా అవుతున్నా రైతుల పంటపొలాలకు నీరందక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకంతోనైనా సాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి.
– ఉరిటి రామారావు, కన్వీనర్, వైఎస్సార్‌సీపీ, గరుగుబిల్లి


సాగునీటి సరఫరాపై ప్రభుత్వం కాకిలెక్కలు
తోటపల్లి ప్రాజెక్టు అంకితం            2015లో..


నీరందించినట్టు ప్రకటించింది    50 వేల ఎకరాలు

2016లో    89 వేల ఎకరాలు

2017లో    లక్షా ఏడు వేల ఎకరాలు

2018లో    లక్షా పది వేల ఎకరాలు

వాస్తవానికి నీరందుతున్నది    కేవలం యాభై వేల ఎకరాలు

మరిన్ని వార్తలు