‘నిర్భయ’ మెక్కడ!?

19 Dec, 2013 09:58 IST|Sakshi
‘నిర్భయ’ మెక్కడ!?

ఢిల్లీ రేప్ సంఘటన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది. నిర్భయకు నివాళిగా కొవ్వొత్తుల ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు జరిగాయి. మహిళలపై దాడులను అరికట్టేందుకు నిర్భయ చట్టాన్నీ తీసుకువచ్చింది. కానీ... మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పెళ్లి చేసుకోమన్నందుకు నల్లగొండలో మంగళవారం ఇంజనీరింగ్ విద్యార్థినిపై ప్రేమికుడు కిరోసిన్ పోసి నిప్పంటిస్తే.. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నాలుగు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిపై అదేవిధంగా దాడి జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరేళ్లు, ‘ప్రకాశం’లో ఎనిమిదేళ్లు, హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతున్న బాలికలపై లైంగికదాడులు జరిగాయి.
 
కిరోసిన్ పోసి.. నిప్పంటించి..

పిఠాపురం, న్యూస్‌లైన్: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కీర్తి రేవతి (17)పై  ఎం. నవీన్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు 75 శాతం కాలిన గాయాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. పిఠాపురం వేణుగోపాలస్వామి గుడి వీధిలో నివసిస్తున్న కీర్తి శంకర్‌బాబు కుమార్తె రేవతి పదో తరగతి చదువుతోంది. కత్తులగూడెంనకు చెందిన నవీన్ ఆరు నెలలుగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు.

కుమార్తె నుంచి విషయం తెలుసుకున్న శంకర్‌బాబు అతడ్ని మందలించాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేస్తానని బెదిరించాడు. దీనికి నవీన్ భయపడకపోగా మరింత రెచ్చిపోయాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే పరువు పోతుందని భావించిన శంకర్‌బాబు నెల రోజులుగా కూతురును బడి మాన్పించి అనపర్తికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించాడు.

ఈ నెల 22న వివాహం జరగాల్సి ఉంది. వివాహ సమయం దగ్గరపడడంతో రేవతి తల్లి నాగరత్నం బుధవారం ఉదయం పెళ్లిదుస్తులు కొనుగోలు చేసేందుకు రాజమండ్రి వెళ్లగా, తండ్రి పత్రికలు పంచేందుకు కాకినాడ వెళ్లాడు. రేవతి ఒంటరిగా ఉండడం గమనించిన నవీన్ ఆమె ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన శంకర్‌బాబు నిందితుడ్ని పట్టుకునేందుకు యత్నించాడు. పెనుగులాటలో నవీన్ ఫోన్ కిందపడిపోగా, అతడు పరారయ్యాడు. 75 శాతం గాయాలైన రేవతి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.

 

మరిన్ని వార్తలు