కాల్‌మనీ కేసులో ముగ్గురికి బెయిల్

20 Jan, 2016 04:50 IST|Sakshi

విజయవాడ లీగల్: కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి.అనుపమచక్రవర్తి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. కేసులో నిందితులుగా ఉన్న యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాము, పోలురౌతుల భవానీ శంకర్‌వరప్రసాదు అలియాస్ భవానీ శంకర్, దూడల రాజేష్‌లు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత నెలలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదోపవాదాలు అనంతరం న్యాయమూర్తి నిందితులకు బెయిల్ నిరాకరించారు. నిందితులు మళ్లీ తమ న్యాయవాదుల ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వాదనల అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.
 
 మల్లాది విష్ణు కస్టడీ పిటిషన్ తిరస్కరణ
 విజయవాడ లీగల్: కల్తీ మద్యం కేసులో నిందితుడిగా వున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మూడు రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డి.లక్ష్మి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. నాలుగు రోజులు కస్టడీలో విష్ణు సరైన సమాచారం ఇవ్వకపోగా, విచారణకు సహకరించలేదని, అందువల్ల మళ్లీ కస్టడీ కోరుతూ కృష్ణలంక పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు. కాగా, మల్లాది విష్ణు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నగర మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు