దత్తన్న లేఖే ‘సెంట్రల్’

20 Jan, 2016 05:50 IST|Sakshi

రోహిత్ ఆత్మహత్యకు కేంద్రబిందువుగా కేంద్రమంత్రి లేఖ

ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌పై రోహిత్ దాడి చేసినట్లు రుజువులు లేవన్న వర్సిటీ విచారణ కమిటీ... దత్తాత్రేయను ఆశ్రయించిన సుశీల్‌కుమార్
వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడి వినతిపత్రాన్ని జతచేస్తూ ఆగస్టు 17న హెచ్‌ఆర్‌డీకి ఉత్తరం రాసిన దత్తాత్రేయ
ఏం చర్యలు తీసుకున్నారంటూ వర్సిటీ వీసీకి హెచ్‌ఆర్‌డీ నుంచి ఐదు వరుస లేఖలు
సెప్టెంబర్ 3, 24, అక్టోబర్ 6, 20, నవంబర్ 19న లేఖల పరంపర
ఆగస్టులోనే ప్రొఫెసర్ల ద్విసభ్య కమిటీ క్లీన్‌చిట్ ఇచ్చినా... చివరకు డిసెంబర్ 21న ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్  
హాస్టల్, పరిపాలన భవనంలోకి అడుగుపెట్టరాదంటూ కఠినమైన ఆంక్షలు
రాజకీయ ఒత్తిళ్ల వల్లే హెచ్‌ఆర్‌డీ జోక్యం చేసుకుందన్న విద్యార్థి సంఘాలు


సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హెచ్‌సీయూలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య వివాదానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆగస్టు 17న రాసిన లేఖ కేంద్ర బిందువైంది. విశ్వవిద్యాలయం పరిధిలోని లోక్‌సభ సభ్యుడి హోదాలో దత్తాత్రేయ లేఖ రాయడం, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆ లేఖ వివరాలను ప్రస్తావిస్తూ ఐదు సార్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌కు లేఖ రాయడం వల్లే విద్యార్థులు సస్పెన్షన్‌కు గురయ్యారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ హోదాలో దత్తాత్రేయ రాజకీయంగా ఒత్తిడి తేవడం, వర్సిటీ నుంచి సస్పెన్షన్‌తో వదిలిపెట్టకుండా హాస్టల్ కూడా ఖాళీ చేయాలనడం, పరిపాలన భవనంలోకి అడుగుపెట్టవద్దని ఆంక్షలు విధించినందువల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ ఏబీవీపీ విభాగం అధ్యక్షుడు సుశీల్‌కుమార్  ఇచ్చిన వినతిపత్రాన్ని జత చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలంటూ దత్తాత్రేయ గతేడాది ఆగస్టులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. యాకూబ్ మెమన్ ఉరికి వ్యతిరేకంగా వర్సిటీలో నిరసనలు తెలిపిన ఘటనను ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. మెమన్ ఉరిపై నిరసన తెలియజేయడం ఏమిటని ప్రశ్నించినందుకు సుశీల్ కుమార్‌పై దాడికి పాల్పడ్డారని, ఫలితంగా ఆయన ఆస్పత్రిలో చేరారని, దాడికి కారకులపై చర్య తీసుకోవాలని దత్తాత్రేయ ఆ లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో ఏ చర్యలు తీసుకున్నారంటూ  హెచ్‌ఆర్‌డీ శాఖ పలుమార్లు వీసీకి లేఖలు రాసింది.
 
లేఖల పరంపర ఇదీ..: హెచ్‌సీయూలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయంటూ దత్తాత్రేయ లేఖ రాసిన తర్వాత తగిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖ ఐదు లేఖలు రాసింది. దత్తాత్రేయ లేఖను జత చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలంటూ సెప్టెంబర్ 3, అదేనెల 24న హెచ్‌ఆర్‌డీ ఉప కార్యదర్శి పేరిట వర్సిటీ వీసీకి లేఖలందాయి. ఆగస్టు 17నాటి దత్తాత్రేయ లేఖ, సెప్టెంబర్ 3, 24 తేదీల్లో ఉప కార్యదర్శి రాసిన లేఖలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ అక్టోబర్ 6, అదేనెల 20 తేదీల్లో సంయుక్త కార్యదర్శి పేరిట మరో లేఖ అందింది. అప్పటికీ వీసీ నుంచి సమాధానం లేకపోవడంతో నవంబర్ 19న హెచ్‌ఆర్‌డీ అండర్ సెక్రటరీ పేరిట ఇంకో లేఖ అందింది.

దత్తాత్రేయ రాసిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలన్నదే ఈ లేఖల ఉద్దేశం. అండర్ సెక్రటరీ రాసిన చివరి లేఖలో మాత్రం... వర్సిటీలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడుతున్న విద్యార్థులపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించారు. హెచ్‌ఆర్‌డీ శాఖ నుంచి లేఖలు రావడంతో వీసీ ఒత్తిడికి లోనై రోహిత్‌తో పాటు ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
 
సస్పెన్షన్‌లోనూ కఠినమైన ఆంక్షలు
మామూలుగా విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే వర్సిటీలో తరగతులకు హాజరవకుండా సస్పెన్షన్ విధిస్తారు. సస్పెన్షన్ ముగిసేదాకా ఎలాంటి అకడమిక్ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడానికి వీలుండదు. కానీ రోహిత్‌తోపాటు నలుగురు విద్యార్థులపై హాస్టల్, భోజనశాలతో పాటు క్యాంపస్ ఆవరణలోని పరిపాలన భవనంలోకి అడుగుపెట్టకూడదని ఆంక్షలు విధించారు. సాధారణంగా విద్యార్థుల సస్పెన్షన్‌లో ఇలాంటి ఆంక్షలు ఉండవని విద్యార్థి సంఘాలంటున్నాయి. దానికి తోడు దత్తాత్రేయ లేఖ ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు విద్యార్థులకు చెప్పడం కూడా వారి ఆగ్రహానికి కారణమని ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి నివేదించింది.

మామూలుగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వీసీ లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశమై ఫిర్యాదులో నిజానిజాలు పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. అలాంటప్పు డు ఫిర్యాదు చేసినవారి వివరాలు బహిర్గతం చే యాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లు బుకడంతో వర్సిటీ అధికారులు తమ తప్పు లేదని చెప్పుకోవడానికి దత్తాత్రేయ లేఖను బహిర్గతం చేశారు.దాంతోపాటే హెచ్‌ఆర్‌డీ లేఖల వివరాలను కూడా విద్యార్థి సంఘాలకు అందించారు.
 
వర్సిటీపై ఎలాంటి ఒత్తిడి తేలేదు: హెచ్‌ఆర్‌డీ
సాక్షి,న్యూఢిల్లీ: రోహిత్ సస్పెన్షన్ విషయంలో హెచ్‌సీయూపై ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర మానవ వనరుల  శాఖ ఖండించింది. తాము కార్యాలయ విధానాల మాన్యువల్‌కు అనుగుణంగా వ్యవహరించామని శాఖ ప్రతినిధి ఘనశ్యామ్ గోయల్ మంగళవారం తెలిపారు. నిబంధనల ప్రకారం వీఐపీ రాసిన ఉత్తరాలకు 15 రోజుల్లో అవి అందినట్లుగా ధ్రువీకరించాల్సి ఉంటుందని, మరో 15 రోజుల్లో జవాబు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అయితే వర్సిటీ నుంచి స్పందన రాకపోవడంతో రిమైండర్లు పంపించాల్సి వచ్చింద న్నారు. పెండింగ్‌లో ఉన్న హామీలు, వీఐపీల సూచనల వివరాలను కూడా కేబినెట్ సమావేశాల్లో మంత్రిత్వ శాఖ అందివ్వాల్సి ఉంటుందన్నారు. జనవరి 7న మంత్రిత్వ శాఖకు హెచ్‌సీయూ జవాబు పంపించిందని అధికారులు తెలిపారు.
 
హెచ్‌సీయూలో గత ఆరు నెలలుగా చోటుచేసుకున్న పరిణామాలివీ..

జూలై 30: యాకూబ్ మెమన్ ఉరి. అదే రోజు వర్సిటీలో ఉరికి వ్యతిరేకంగా అంబేద్కర్ విద్యార్థి సంఘం (ఏఎస్‌ఏ) నిరసనలు
 
ఆగస్టు 3: అంబేద్కర్ విద్యార్థి సంఘంలో అవివేకులున్నారని, వారివి పోకిరి చేష్టలు అంటూ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ ఫేస్‌బుక్ స్టేటస్‌ను అప్‌డేట్ చేశారు
 
ఆగస్టు 4: హెచ్‌సీయూ క్యాంపస్‌లో రోహిత్, ఇతర విద్యార్థులు తనను కొట్టారంటూ సుశీల్‌కుమార్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు
 
ఆగస్టు 4-13: ఏబీవీపీ, ఏఎస్‌యూ మధ్య గొడవలు. క్యాంపస్‌లో మీటింగ్‌కు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరు. దాడి చేసిన విద్యార్థులపై చర్య తీసుకోవాలని డిమాండ్. ఘటనపై విచారణకు ఆదేశించిన వైస్ చాన్స్‌లర్. సుశీల్‌కుమార్‌పై రోహిత్ దాడి చేసినట్లు ఎలాంటి రుజువులు లేవని తేల్చిచెప్పిన ప్రొఫెసర్ ఆర్.పి.శర్మ, ప్రొఫెసర్ అలోక్ పాండే విచారణ కమిటీ
 
ఆగస్టు 17: హెచ్‌సీయూ క్యాంపస్‌లో సుశీల్‌కుమార్‌పై ఘటనకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన కేంద్రమంత్రి దత్తాత్రేయ

సెప్టెంబర్ 3: దత్తాత్రేయ లేఖలో వివరాలను ఉటంకిస్తూ హెచ్‌సీయూ వీసీకి మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి లేఖ
 
సెప్టెంబర్ 24: సెప్టెంబర్ 3 నాటి లేఖకు వివరణ కోరుతూ వీసీకి ఉప కార్యదర్శి లేఖ
 
అక్టోబర్ 6: దత్తాత్రేయ లేఖ, ఉపకార్యదర్శి మెమోలకు సంబంధించి వివరణ కోరుతూ వీసీ కి లేఖ రాసిన హెచ్‌ఆర్‌డీ సంయుక్త కార్యదర్శి
 
అక్టోబర్ 20: అంతకుముందు రాసిన లేఖలకు సంబంధించి తీసుకున్న చర్యలపై వివరణ కోరుతూ వీసీకి సంయుక్త కార్యదర్శి లేఖ
 
నవంబర్ 19: దత్తాత్రేయ లేఖ, ఉప కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి లేఖలకు వివరణ ఇవ్వకపోవడంపై వైస్ చాన్స్‌లర్‌కు హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లేఖ
 
డిసెంబర్ 21: రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులను వర్సిటీ నుంచి సస్పెండ్ చేసిన వీసీ
 
జనవరి 17:
రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య

>
మరిన్ని వార్తలు