గూగుల్‌ గుత్తాధిపత్యం..డీఫాల్ట్‌ సెర్చింజన్‌ కోసం 28 బిలియన్‌ డాలర్లు ఖర్చు

28 Oct, 2023 09:43 IST|Sakshi

సెర్చింజన్‌ మార్కెట్లో గూగుల్‌ ఆధిపత్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై యూఎస్‌ ప్రభుత్వం, గూగుల్‌ మధ్య యాంటీట్రస్ట్‌ కేసు కొనసాగుతోంది. తాజాగా జరిగిన ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ఈ సందర్భంగా మొబైల్స్‌, వెబ్‌బ్రౌజర్లలో గూగుల్‌ను డీఫాల్ట్‌ సెర్చింజన్‌గా ఉంచేందుకు 2021లో ఆ సంస్థ పలు కంపెనీలకు 26.30 బిలియన్‌ డాలర్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం..డీఫాల్ట్‌ సెర్చింజన్‌ స్టేటస్‌ కోసం గూగుల్‌ చెల్లింపులు 2014 నుంచి ముడింతలు పెరిగాయని గూగుల్‌ సెర్చ్‌ అండ్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ విభాగంలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా ప్రభాకర్‌ రాఘవన్‌ ఇదే విషయాన్ని తెలిపారు. సెర్చ్‌ యాడ్స్‌ ద్వారా గూగుల్‌కి 2021లో 146.4బిలియన్‌ డాలర్లు రెవెన్యూ వచ్చిందని..అందులో ఎక్కువ మొత్తం డీఫాల్ట్‌ సెట్టింగ్‌ కోసమే ఖర్చవుతున్నట్లు చెప్పారంటూ నివేదించింది. 

అయితే, ఈ విచారణ సందర్భంగా.. ఆదాయ వాటా, ఒప్పందాలు, చట్టబద్ధమైనవని గూగుల్‌ తెలిపింది. సెర్చింగ్‌, అడ్వటైజింగ్‌ విభాగంలో పెరిగిపోతున్న పోటీని తట్టుకునేలా పెట్టుబడి పెట్టినట్లు వాదించింది. ప్రజలు డిఫాల్ట్‌ సెర్చింజిన్‌ పట్ల అసంతృప్తిగా ఉంటే, వారు మరొక సెర్చ్ ప్రొవైడర్‌ మార్చుకోవచ్చు విజ్ఞప్తి చేసింది.

అదే సమయంలో ఇలా చెల్లింపులకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయడం వల్ల భవిష్యత్తులో తాము కుదుర్చుకునే కాంట్రాక్టులపై ప్రభావం చూపుతుందని గూగుల్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా.. కోర్టు మాత్రం ఆ వివరాలు వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతంది. 

మరిన్ని వార్తలు