వాటా దక్కేనా?

17 Jun, 2015 09:28 IST|Sakshi

కరువు జిల్లాను అంతో ఇంతో తడుపుతాయనుకుంటే తుంగభద్ర జలాలు కూడా సరిహద్దులకు చేరకుండా మూడో వంతు మాయమవుతున్నాయి. తుంగభద్ర నుంచి న్యాయంగా రావాల్సిన వాటా అయినా దక్కితే ఎంతో కొంత ఊరటగా ఉంటుందన్న అనంత రైతుల ఆశలు ఎండమావులే అవుతున్నాయి. ఈ ఏడాదైనా  కేటాయింపుల్లో న్యాయం జరిగేనా  అని మరోసారి రైతులు ఎదురు చూస్తున్నారు. బుధవారం కర్ణాటక  రాష్ట్రంలోని హొస్పేటలో తుంగభద్ర బోర్డు మొదటి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో గత కేటాయింపులపై సమీక్షిస్తే అన్నీ ఆవేదనలే.
 
అనంతపురం టవర్‌క్లాక్: హెచ్చెల్సీపై ఆధారపడి జిల్లాలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. ఎగువ కాలువ ద్వారా రాయదుర్గం పట్టణంతో పాటు, పరిసర గ్రామాలకు సాగునీటితో పాటు తాగునీరు అందుతోంది.. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ద్వారా గుంతకల్లు పట్టణానికి, పీఏబీఆర్ తాగునీటి పథకం ద్వారా అనంతపురం, హిందూపురం, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం, సత్యసాయి తాగునీటి పథకం ద్వారా 700 గ్రామాలకు సర ఫరా అవుతోంది. జిల్లాకు ఇంత ప్రధామైన హెచ్చెల్సీకి నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోంది. అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు తాగునీరు, లక్ష ఎకరాల ఆయకట్టుకు కేటాయించిన 32.5 టీఎంసీల నీటిని ఎన్నడూ విడుదల చేసింది లేదు.

డ్యాంలో పూడిక ఎక్కువగా ఉందన్న సాకుతో ఏటా సుమారు 22.5 టీఎంసీల చొప్పున విడుదల చేస్తోంది. ఫలితంగా 0 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తోంది. దీంతో పాటు పులివెందులబ్రాంచ్‌కెనాల్, ఆలూరుబ్రాంచ్ కెనాల్‌కు నీరు సరఫరా కావాలి. ఈ మొత్తానికి సరిపడా నీరు కావాలంటే దాదాపు 40 టీఎంసీల అవసరమని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే డ్యాం నుంచి 22.5 టీఎంసీల చొప్పున మాత్రమే సరఫరా అవుతున్నాయి. డ్యాంలో నీటిప్రవాహం ఉధృతంగా ఉన్నపుడు కూడా సరిపడా నీటిని తెచ్చుకోలేకపోతున్నాం. దీనికి కారణం హెచ్చెల్సీ కాలువ పూడికతో ఉండటమే! డ్యాం నుంచి జిల్లా సరిహద్దు వరకూ 105 కిలీమీటర్ల మేర కాలువను 4వేల క్యూసెక్కుల ప్రవాహసామర్థ్యంతో నిర్మించారు. కాలువలో పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం 2500-2,800 క్యూసెక్కులకు మించి నీరు ప్రవహించడం లేదు.

ఈ ప్రవాహం 105 కిలోమీటరు వరకూ వస్తే మరింత తగ్గుతోంది. దీని కోసం డ్యాం నుంచి సమాంతర కాలువ కావాలని ఏపీ ప్రభుత్వం సుదీర్ఘంగా పోరాడుతోంది. ఇందుకు కర్నాటక ప్రభుత్వం ఒప్పుకోలేదు. కనీసం 105 కిలోమీటరు వరకూ కాలువ సామర్థ్యాన్ని 6వేల క్యూసెక్కుల ప్రవాహసామర్థ్యానికి పెంచాలని అడిగారు. దీనికి ఒప్పుకోవడం లేదు. కేవలం 4వేల క్యూసెక్కులు ప్రవహించేలా కాలువను ఆధునికీకరిస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ‘అనంత’ రైతుల్లో ఆశలు రేపాయి. ఇటీవల మడకశిర సమీపంలోని కర్నాటకలో జరిగిన బహిరంగసభకు వెళ్లిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హెచ్చెల్సీ సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనికి సిద్ధరామయ్య స్పందించి...తప్పకుండా పరిష్కరిస్తామని, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు బోర్డుతో కలిసి చర్చించి సానుకూల నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు.

ప్రస్తుతం ఆరు టీఎంసీలే:
100 టీఎంసీల సామర్థ్యం ఉన్న తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 6.562 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. హెచ్చెల్సీకి నీటిని విడుదల చేయాలంటే డ్యాంలో నీటిమట్టం 1600 అడుగులకు చేరుకోవాలి. అయితే వర్షాకాలం ఇప్పుడే మొదలుకావడంతో 1584.5 అడుగుల నీరు మాత్రమే డ్యాంలో నిలువ ఉంది. జూలై మొదటి వారంలో నీటిమట్టం 1600 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు హెచ్చెల్సీ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పాలకులు, అధికారులు గట్టిగా ప్రయత్నించకపోతే ఈ ఏడాది కూడా మన వాటా నీరు విడుదల చేయడం అనుమానమే.

మరిన్ని వార్తలు