శ్రీవారి హుండీకి గండి

23 Feb, 2014 02:02 IST|Sakshi
శ్రీవారి హుండీకి గండి

 సీమాంధ్రలో ఆందోళనలతో తగ్గిన భక్తుల రాక
 అంచనా కన్నా రూ. 27 కోట్లు తగ్గిన ఆదాయం
 టీటీడీ 2014-15 బడ్జెట్ రూ. 2,401 కోట్లు
 పలు తీర్మానాలకు బోర్డు ఆమోదముద్ర
 
 సాక్షి, న్యూస్‌లైన్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,401 కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ఖరారు చేసింది. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ అతిథిగృహంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్‌గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రూ. 2,359 కోట్లతో ప్రతిపాదిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కొన్ని మార్పులు చేర్పులతో రూ. 2,401 కోట్ల అంచనాలతో తుది వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేసింది. అయితే దర్శనం టికెట్లు, అద్దెలు, ఇతర అనేక ఆదాయ మార్గాలున్నా ఎందులోనూ ఒక్క రూపాయి కూడా అదనంగా పెంచలేదని చైర్మన్ బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో తగ్గిన ఆదాయాన్ని పెట్టుబడులతో సవరించామన్నారు. తెల్లరేషన్ కార్డులు ఉన్నా.. లేకున్నా నిరుపేదలకు స్విమ్స్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించనున్నట్లు చెప్పారు. గత (2013-14) ఆర్థిక సంవత్సరానికి రూ. 2,248 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్... చివరకు రూ. 2,263 కోట్లతో ముగిసింది. సీమాంధ్ర బంద్ ప్రభావం తిరుమలేశుని హుండీ కానుకలపై కూడా కనిపించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 859 కోట్ల మేర హుండీ కానుకలు రావచ్చని అంచనా వేయగా, రూ. 832 కోట్లు మాత్రమే వచ్చాయి. దాదాపు అరకోటి భక్తుల రాక తగ్గడంతో ఈ రూ. 27 కోట్లు తేడా కనిపించింది. కాగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 900 కోట్లు రావచ్చని అంచనా వేయగా, సుమారుగా రూ. 1000 కోట్లు దాటే అవకాశం ఉందని టీటీడీ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ-వేలంలో తలనీలాల విక్రయం ద్వారా రూ. 200 కోట్లు వస్తుందని అంచనా వేయగా, రూ. 20 కోట్లు అదనంగా చేకూరింది. 2014-15లో కూడా రూ. 220 కోట్లే రావచ్చని అంచనా వేసినప్పటికీ, అది రూ. 300 కోట్లు దాటవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు భావిస్తున్నారు.  
 
 టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానాలివీ...
 
 ధర్మకర్తల మండలి 2007లో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుత మార్కెట్ ధరను అనుసరించి టీటీడీ ఉద్యోగులు 2,833 మందికి స్థలాలు, అపార్ట్‌మెంట్ తరహా ఇళ్ల నిర్మాణానికి ఆమోదం. 60 శాతం వరకు నిర్మాణ వ్యయాన్ని టీటీడీ భరిస్తుంది.
 తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో మార్చి నెల నుంచి తెల్ల రేషన్‌కార్డుదారులకు వంద శాతం రాయితీతో వైద్య సేవలు. ఆ కార్డు లేకున్నా రోగి జబ్బు తీవ్రతను బట్టి ఉచిత వైద్యం అందించే విచక్షణాధికారం స్విమ్స్ డెరైక్టర్‌కు అప్పగింత. దీనివల్ల స్విమ్స్‌పై పడే అదనపు ఆర్థిక భారం పరిశీలనకు కమిటీ ఏర్పాటు.
 తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలోని ఆరు వాహనాలకు రూ. 8.75 కోట్లతో బంగారు తాపడం.
  ఎస్వీ గోశాలకు చెందిన ఆరు గోవులు, తిరుపతిలోని మానసిక వికలాంగులు, వృద్ధులకు సేవలందించే బాధ్యత రాష్ట్రీయ సేవా సమితి (రాస్)కు అప్పగింత.
  ఎస్వీ శిల్ప కళాశాల విద్యార్థులకు మూడేళ్ల కోర్సు పూర్తి చేసిన అనంతరం రూ. లక్ష ఉపకార వేతనంగా మంజూరు. ఇది 2007 నుంచి వర్తింపజేయనున్నారు.
  బర్డ్ డెరైక్టర్ డాక్టర్ జగదీశ్ పదవీ కాలం మరో రెండేళ్లు పొడిగింపు.


 

మరిన్ని వార్తలు