అంతఃకరణ శుద్ధితో పనిచేయండి

13 May, 2018 09:13 IST|Sakshi
నూతన కమిషనర్‌ విజయరామరాజు, తుడా కార్యదర్శి మాధవీలత, ఇతర అధికారులు

మున్సిపల్‌ కమిషనర్, తుడా వీసీగా విజయరామరాజు బాధ్యతల స్వీకరణ

తిరుపతి తుడా: నా తిరుపతి.. నా పని.. అని ఇష్టం తో కష్టం లేకుండా ప్రతి ఉద్యోగి అంతఃకరణశుద్ధితో పనిచేయాలని తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమి షనర్‌ వీ. విజయరామరాజు సూచించారు. కార్పొరేషన్‌ కమిషనర్‌గా, తుడా వీసీగా శనివారం ఆయన ఇన్‌చార్జి కమిషనర్‌ డాక్టర్‌ కే.మాధవీలత నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన వివిధ శాఖల విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన కమిషనర్‌ మాట్లాడుతూ తన పాలనలో పనిచేసేవారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు.

ఉద్యోగులకు కొలమానం చిత్తశుద్ధితో పనిచేయడమేనన్నారు. అవినీతి, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఉద్యోగులకు అంతర్గతంగా టెలిగ్రామ్‌ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులుంటే తనను నేరుగా కలిసి చెప్పుకోవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి, శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సీనియర్‌ సిటీజన్లను సమన్వయపరుచుకుని స్మార్ట్‌సిటీ అభివృద్ధిని వేగవంతం చేస్తానని చెప్పారు. తుడా మాస్టర్‌ ప్లాన్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నట్టు   తెలిపారు.   తుడా సెక్రటరీ మాధవీలత, ఈఈ ప్రభాకర్‌రెడ్డి, పీఓ కృష్ణారెడ్డి, ఏఓ హరినాథరెడ్డి, వీసీ పీఎస్‌ వెంకట్‌æరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు