‘పాపికొండలు రాను డాడీ.. పార్క్‌కు వెళ్తా’

17 Sep, 2019 07:08 IST|Sakshi

బోటు ప్రమాదంలో గల్లంతయిన హాసిని మృతదేహం వెలికితీత

ఆమె తండ్రి సుబ్రమణ్యం కోసం ఆందోళన

తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి

భయపడినట్లే.. జరిగింది.. పాపికొండల ప్రయాణం ప్రాణాలు తీసింది. గోదావరి నది పడవ ప్రమాదం తిరుపతికి చెందిన సుబ్రమణ్యం కుటుంబాన్ని చిదిమేసింది. చిట్టిపొట్టి పలుకులతో, అల్లరి చేష్టలతో నిత్యం ఉత్సాహంగా ఉండే హాసిని.. నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయి కన్నుమూసింది. చిన్నారి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పుణ్యం కోసం గోదారమ్మ ఒడ్డుకెళ్తే.. పుట్టెడు సోకం మిగిలిందంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు. గోదావరి బోటు మునక ప్రమాదంలో గల్లంతైన తిరుపతికి చెందిన సుబ్రమణ్యం(45), మధులత(40) దంపతుల కుమార్తె హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి. ఈ ఉదయం దేవీపట్నం సమీపంలోని కచ్చలూరు వద్ద నౌకాదళ, రాష్ట్ర అగ్నిమాపకశాఖ, స్థానిక మత్స్యకారులు వెతుకులాట ప్రారంభించారు. అయితే నదీ ప్రవాహవేగం, లోతు, నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. కాగా తిరుపతికి చెందిన సుబ్రమణ్యం తన తండ్రి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భార్య మధులత, కుమార్తె హాసినితో కలసి వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం పాపికొండల అందాలను వీక్షించేందుకు అందరూ బోటులో బయలుదేరారు. అయితే దేవీపట్నం వద్ద గోదావరిలో బోట్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి మధులత బయటపడగా.. సుబ్రమణ్యం, హాసిని గల్లంతయ్యారు. ఈ క్రమంలో సోమవారం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. హాసిని మృతదేహం బయటపడింది. సుబ్రమణ్యం వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

అయ్యో..! హాసిని 
‘నేను రాను డాడీ.. స్కూల్‌ ఫ్రెండ్స్‌తో కలిసి జూ పార్క్‌కు వెళ్తా’నని దుర్గం హాసిని (12) మారాం చేసింది. తాత అస్థికల్ని నిమజ్జనం చేయడానికి అందరం వెళ్లాలని తండ్రి సుబ్రహ్మణ్యం బలవంతం చేయడంతో తల్లిదండ్రులతో కలసి బయలుదేరింది. ఆ మరునాడు పడవ ప్రమాదంలో హాసిని ప్రాణాలు కోల్పోగా.. తండ్రి సుబ్రహ్మణ్యం గల్లంతయ్యాడు. ప్రమాదం నుంచి బయటపడిన మధులతకు కుమార్తె హాసిని మృత్యువాత పడిన విషయం సోమవారం తెలిసింది. కుమార్తె ఇక లేదని తెలిసి తల్లి మధులత గుండెలు బాదుకుంటూ తల్లడిల్లుతోంది. తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం సొంతూరు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేపనపల్లి. ఆ చిన్నారి తిరుపతి స్ప్రింగ్‌ డేల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. పాఠశాల యాజమాన్యం విద్యార్థులందరినీ శనివారం జూ పార్క్‌ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ రోజు తమతో కలిసి జూ పార్క్‌కు వచ్చి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కాళ్లు పట్టుకున్నా కాపాడలేకపోయా!
‘‘పడవ బోల్తా పడిన వెంటనే నా భర్త సుబ్రమణ్యం నన్ను నీటిలో నుంచి పైకి నెట్టి కాపాడారు. అదే సమయంలో నా కాళ్లు పట్టుకుని ఉన్న నా కుమార్తె హాసినిని కూడా పైకి నెట్టి రక్షించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. నన్ను కాపాడి నా కళ్లముందే ఆయన నీటిలో మునిగిపోయారు. నా బిడ్డ నా కాళ్లు పట్టుకున్నా.. నేను కాపాడుకోలేకపోయాను’’    – మధులత 

ప్రయాణం వాయిదా వేసుంటే..
సుబ్రమణ్యం తండ్రి అస్థికలను గోదావరిలో కలిపేందుకు భార్య, కూతురితో ఈనెల 13వ తేదీ రాత్రి రాజమండ్రికి బయలుదేరారు. హాసిని చదువుతున్న పాఠశాల విద్యార్థులు 14వ తేదీ జూపార్కును సందర్శించారు. తోటి విద్యార్థులతో కలసి తాను కూడా వెళ్లాలనుకుంది. ఆ విషయం తన తండ్రితో  చెప్పింది. అయితే ముందుగా రాజమండ్రికి వెళ్లాల్సిందేనని తండ్రి సుబ్రమణ్యం తేల్చి చెప్పారు. ఒకవేళ వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.  హాసిని లాంటి ఓ మంచి విద్యార్థినిని కోల్పోవడం బాధాకరమంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు. 

బోటు యజమాని కోసం గాలింపు
దేవీపట్నం నుంచి సాక్షిప్రతినిధి బృందం: నిబంధనలకు విరుద్ధంగా బోటును నిర్వహించి.. ఘోర ప్రమాదానికి కారణమైన యజమాని కోడిగుడ్ల వెంకటరమణ కోసం పోలీసులు వెతుకుతున్నారు. విశాఖపట్నానికి చెందిన వెంకటరమణపై దేవీపట్నం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అతనిపై సెక్షన్‌ 304ఏ కింద ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. దేవీపట్నం తహసీల్దార్‌ మహబూబ్‌ ఆలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటరమణను మొదటి నిందితుడిగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఘటన జరిగినప్పటినుంచి వెంకటరమణ పరారీలో ఉండగా.. అతని ఆచూకీ కోసం రెండు రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా