సర్కారు జాడేది?

17 Oct, 2018 02:49 IST|Sakshi
ఈ చిత్రంలో ఉన్నది శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎల్‌.శివశంకర్‌. ఆయన ఐఏఎస్‌ అధికారి కూడా. మంగళవారం రాత్రి ఆయన మందస మండల కేంద్రంలోని ఓ భవనంలో కరెంటు లేకపోవడంతో కొవ్వొత్తి, సెల్‌ఫోన్‌ వెలుగులోనే పని చేసుకోవాల్సి వచ్చింది.

తీరని ‘తిత్లీ’ కష్టాలు.. ఆరు రోజులైనా ఇంకా అగచాట్లే

గుక్కెడు తాగునీటి కోసం కటకట

 ఆహారం అందక ఆకలి కేకలు

ఇప్పటికీ పునరుద్ధరణకు నోచుకోని విద్యుత్తు 

రాత్రిపూట దోమల బాధతో సతమతం 

బాధితుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు 

20 లీటర్ల మంచినీటి క్యాన్‌కు రూ.100 వసూలు.. రూ.10 విలువైన కొవ్వొత్తి రూ.50కి విక్రయం 

నత్తనడకన సహాయ చర్యలు 

శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి మకాం వేసినా మారని దుస్థితి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రకృతినే హ్యాండిల్‌ చేసే మాటెలా ఉన్నా శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాన్‌ ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కదిద్దలేకపోతున్నారు. తమకు ఆహారం, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో సైతం ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తుపాన్, వరద బాధితులు మండిపడుతున్నారు. రెండు రోజుల్లోనే కరెంట్‌ సరఫరా పునరుద్ధరిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆరు రోజులు గడిచినా కరెంటు జాడే కనిపించడం లేదు. గొంతెండిపోతోంది, గుక్కెడు నీరు ఇప్పించండంటూ వేలాది మంది గగ్గోలు పెడుతున్నారు. ఒక అన్నం పొట్లం, రాత్రిపూట కొవ్వొత్తి అయినా ఇవ్వండని దీనంగా వేడుకుంటున్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు ఇప్పటికీ ఊపందుకోలేదు.  

జాడ లేని కరెంటు 
శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాన్‌ వెళ్లిపోయి ఆరు రోజులైంది. ఈ నెల 10వ తేదీ రాత్రి నుంచి 11వ తేదీ మధ్యాహ్నం వరకూ భారీ వర్షాలు, ఈదురుగాలులతో జిల్లా ఛిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే. జిల్లాలోని 38 మండలాల్లో తుపాన్, తదనంతరం వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదుల్లో వచ్చిన వరదల కారణంగా 25 మండలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిగిలిన 13 మండలాలపైనా తుపాన్‌ ప్రభావం కనిపిస్తోంది. ఈ 13 మండలాల్లోనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించగలిగారు. మిగతా 25 మండలాల్లో ఇప్పటివరకూ కరెంటు పునరుద్ధరణ జరగనేలేదు. కొన్ని ప్రాంతాల్లో విరిగిపోయిన స్తంభాలనూ ఇంకా తొలగించలేదు. ఈ 25 మండలాల్లో 12 మండలాలు టెక్కలి డివిజన్‌లోనే ఉన్నాయి. పాలకొండ డివిజన్‌లో 6, శ్రీకాకుళం డివిజన్‌లో 7 మండలాలు ఉన్నాయి. తుపాన్‌ ప్రభావిత గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణకు జనరేటర్లు ఏర్పాటు చేశామని మంత్రి కళావెంకట్రావు చెప్పినప్పటికీ అవి ఒకటీ రెండు చోట్లకే పరిమితమయ్యాయి. 

గుక్కెడు తాగునీటి కోసం అష్టకష్టాలు 
తిత్లీ ప్రభావంతో టెక్కలి డివిజన్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగానికి చెందిన 16 పథకాలు దెబ్బతిన్నాయి. మరో 11 పథకాలకు పంపులు (మెషినరీ) పాడయ్యాయి. మరో 4 చిన్ననీటి పథకాల పైపులైన్లు ధ్వంసమయ్యాయి. వాటిలో ఏ ఒక్కటీ పునరుద్ధరణకు నోచుకోలేదు. ఇవి తిరిగి పని చేయాలంటే విద్యుత్తు సరఫరా చేయడంతోపాటు మోటార్లు, పైపులైన్లకు మరమ్మతులు చేయించాల్సి ఉంది. అగ్నిమాపక యంత్రాలతో నీటిని తీసుకొచ్చే ఏర్పాటు చేసినప్పటికీ అవీ రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాలకే పరిమితమవుతున్నాయి. ఇదే అదనుగా 20 లీటర్ల మంచినీటి క్యాన్‌ ధరను ప్రైవేట్‌ వ్యాపారులు రూ.100 వరకూ పెంచేశారు. 

ఇంకా అందని నిత్యావసరాలు 
తుపాన్‌ బాధిత ప్రాంతాల్లో బియ్యం, కందిపప్పు, వంటనూనె, పంచదార వంటి నిత్యావసర సరుకులను పౌర సరఫరాల శాఖ ద్వారా బాధితులందరికీ అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఇప్పటివరకూ 90 శాతం గ్రామాల్లో ఇంకా డిపోలకే ఈ సరుకులు చేరలేదు. బాధితులకు పంపిణీ చేయడానికి మరో రెండు మూడు రోజుల సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆహార పొట్లాల పంపిణీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. తిత్లీ తుపాన్‌తో శ్రీకాకుళం జిల్లాలో 2.75 లక్షల కుటుంబాలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ, రెవెన్యూ లెక్కల ప్రకారం చూస్తే ఈ సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంటుంది. బాధితులందరికీ భోజనం అందించేందుకు ప్రతి గ్రామంలో వంటలు తయారు చేయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ, ఇప్పటివరకూ అవేవీ ప్రారంభం కాలేదు. చాలా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణల్లో ఇప్పటివరకూ చెట్లు తొలగింపు, భవనాల మరమ్మతుల పనులే ప్రారంభం కాలేదు. 

పొంచి ఉన్న రోగాల ముప్పు 
కూలిపోయిన చెట్లు కాలువల్లో అడ్డంగా పడిపోవడం, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడం, ఇళ్ల మధ్య మురుగు పేరుకుపోవడంతో గ్రామాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. రాత్రి అయ్యేసరికి వాటితో వేగలేక ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. అసలే చిమ్మచీకటి, ఆపై దోమలు కుడుతుండడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. దోమకాటు, కలుషిత నీటితో ఎలాంటి రోగాలు బారినపడాల్సి వస్తుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. కనీసం కొవ్వొత్తులు, దోమల నివారణ చక్రాలు సరఫరా చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రూ.10 విలువైన కొవ్వొత్తిని రూ.50కి అమ్ముతున్నారు. 

ముఖ్యమంత్రి, మంత్రుల సేవలో అధికారులు 
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి, 15 మంది మంత్రులు, 38 మంది ఐఏఎస్‌ అధికారులు, 180 మంది స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు మకాం వేశారు. వారి ప్రోటోకాల్‌ బాధ్యతల్లో జిల్లా రెవెన్యూ సిబ్బంది తలమునలై ఉన్నారు. ఉన్నతాధికారులంతా ముఖ్యమంత్రి కాన్వాయ్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సమయానికి ఎవరు కనిపించకపోయినా అందుకు బాధ్యులను చేస్తూ అధికారులను సస్పెండ్‌ చేస్తుండటంతో దాదాపు సిబ్బంది అంతా సీఎం చుట్టూనే చక్కర్లు కొడుతున్నారు. దీంతో సహాయ, పునరావాస చర్యలను పర్యవేక్షించే వారే లేకుండా పోయారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే జిల్లాలో మకాం వేసినా తుపాన్‌ బాధితుల కష్టాలు కడతేరడం లేదు. 

మరిన్ని వార్తలు