నేటి నుంచి ఉద్యమ బాట

13 Sep, 2013 02:51 IST|Sakshi


 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్
 తెలంగాణ స్వయంపాలన, ఆత్మగౌరవ సాధనలో అగ్రభాగాన నిలిచిన ఉద్యోగ సంఘాలు మరోసారి ఉద్యమబాటను ఎంచుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి నుంచీ పొలికేక వేస్తున్న ఉద్యోగులు... మరో దఫా సమరభేరి మోగించేందుకు సన్నద్ధమయ్యారు. తెలంగాణ స్వాభిమాన్ పేరిట పోరుబాటకు ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం అనుకూల ప్రకటన చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై టీఎన్జీవోలు ఆగ్రహంతో ఉన్నారు. హైదరాబాద్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఏపీఎన్జీవోలు నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ వెన్నుదన్నుగా నిలవడాన్ని... ఆందోళనలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సమైక్య ఉద్యమానికి తెరవెనుక ప్రధాన సూత్రదారిగా ఉన్న సీఎం కిరణ్... సీమాంధ్ర ముఖ్యమంత్రిగా మారారనే అంశాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శుక్రవారం నుంచి బహిరంగ ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ స్వాభిమాన్ సదస్సు వరకు దఫాలవారీగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
 
 జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల భాగస్వామ్యం
 తెలంగాణ సానుకూల ప్రకటన నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య విద్వేషాలు పెరుగకుండా  టీఎన్జీవోల ఆధ్వర్యంలో సద్భావన ర్యాలీలు నిర్వహించారు. ఈ నెల రెండు నుంచి ఐదో తేదీ వరకు జిల్లావ్యాప్తంగా  సద్భావన ర్యాలీలు చేపట్టిన విషయం తెలిసిందే. అదేవిధంగా  సీమాంధ్ర, హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యోగులపై దాడులను ఖండిస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల సదస్సు నేపథ్యంలో జరిగిన ఘటనలు టీఎన్జీవోలను ఆలోచింపజేశారుు. ఈ నేపథ్యంలోనే స్వాభిమాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 48 వేల మంది  రిటైర్డ్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, క్యాజువల్, పర్మినెంట్ ఉద్యోగులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేదిశగా  జిల్లా ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ, టీఎన్జీవోలు క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని కదులుతున్నారు.
 

మరిన్ని వార్తలు