అమరావతికి టాలీవుడ్‌!

26 Dec, 2017 02:09 IST|Sakshi

ప్రతిపాదనలు సిద్ధం చేసిన సీఆర్‌డీఏ

రాయితీలు ఇవ్వడానికి సన్నాహాలు

20 ఎకరాల్లో స్టూడియో నిర్మాణానికి కసరత్తు

సాక్షి, అమరావతి: తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్‌)ను రాజధాని అమరావతికి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సినిమాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి ఆకర్షించాలని యత్నిస్తోంది. ఈ మేరకు సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రతిపాదిత రాజధాని నగర పరిధిలోని అనంతవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని 5,167 ఎకరాల్లో మీడియా సిటీని ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

ఈ నగరంలో సినీ–టెలివిజన్‌ పరిశ్రమ, యానిమేషన్‌–వీఎఫ్‌ఎక్స్‌–గేమింగ్, డిజిటల్‌ యాడ్‌–సోషల్‌ మీడియా, టెలికం రంగాలను ప్రోత్సహించనుంది. అమరావతిలో20 నుంచి 30 ఎకరాల్లో  స్టూడియో నెలకొల్పడానికి  ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీన్ని ఏర్పాటు చేసే సంస్థలకు నామమాత్రపు ధర(ఎకరం రూ. 50లక్షలు)కు భూములిస్తామని  ప్రకటించింది. ఇక్కడ సినిమాను నిర్మిస్తే ప్రొడక్షన్‌ ఖర్చులో కొంత మొత్తాన్ని రీయింబర్స్‌ చేయడం, నగదు ప్రోత్సా హకాలు ఇవ్వడం వంటి అంశాలను పరిశీలిస్తోంది. సినిమాలకు సింగిల్‌ విండో అనుమతులిచ్చేందుకు ప్రణాళిక రూపొందిం చింది. అమరావతిలో ప్రారంభించే తెలుగు న్యూస్‌ చానళ్లకు తక్కువ ధరకే భూములివ్వాలని నిర్ణయించింది.

దశల వారీ వ్యూహం: తొలి దశలో 2017 నుంచి 2021 వరకూ సమగ్ర వాణిజ్య పార్క్‌ను ఏర్పాటు చేసి మీడియా హౌస్‌లను రప్పించనున్నారు. రెండో దశలో 2021 నుంచి 2036 వరకూ అంతర్జాతీయ స్థాయిలో అమరావతి ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుపుతారు. ఆ స్థాయి స్టూడియోనూ నెలకొల్పాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సీఆర్‌డీఏ వర్గాల కథనం. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానాలు పలుకు తోంది. çస్టూడియో ఏర్పాటుకు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్, బాలీవుడ్‌ ప్రముఖుడు సుభాష్‌ ఘయ్‌లను ఆహ్వానించి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.   

మరిన్ని వార్తలు