'రోజ్‌' ఇలాగే వెళ్లండి

23 Jul, 2018 12:18 IST|Sakshi

గుంటూరు(లక్ష్మీపురం) : ఆదివారం మధ్యాహ్నం. నగరంలోని వాహనాలు హడావుడిగా ముందుకు కదులుతున్నాయి. లక్ష్మీపురం ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్‌ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తలకు హెల్మెట్, వాహనాలకు పత్రాలు ఉన్నా ఎందుకో కొద్దిగా అనుమానంతో బ్రేక్‌పై కాలు పడింది. అనుకున్నట్లుగానే ట్రాఫిక్‌ సిబ్బంది వాహనాలను ఆపారు. కాగితాలు ఎక్కడ అని గట్టిగా ప్రశ్నించే గొంతులు.. ఈ సారి మౌనంగానే ఉన్నాయి. చేతిలో గులాబీతో మోముపై చిరునవ్వులు చిందించాయి. ‘వెరీ గుడ్‌.. ఇలాగే హెల్మెట్‌ ధరించాలి’ అంటూ భుజం తట్టాయి. ప్రయాణికుల్లో ఎక్కడలేని ఆనందం. ఈసారి ఎక్సలేటర్‌పై కాలు పడడంతో వాహనాలు రయ్యిమంటూ దూసుకెళ్లాయి.

అర్బన్‌ ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ డీఎస్పీ పాపారావు ఆధ్వర్యంలో నగరంలోని పలు కూడళ్లతో ఆదివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. హెల్మెట్‌ధారణతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ గులాబీలు పంచారు. హెల్మెట్‌ లేకుంటే కలిగే అనర్థాలపై హెచ్చరించారు. కార్యక్రమంలో ఈస్ట్‌ ట్రాఫిక్‌ సబ్‌ డివిజన్‌ సీఐ పూర్ణచంద్రరరావు, ఎస్సైలు రాజకుమారి, శివరామకృష్ణయ్య, జేఆర్‌ మోహన్‌రావు, కే సత్యనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు