నేటి నుంచి సమ్మె బాట

6 Feb, 2014 02:18 IST|Sakshi
  •  సమ్మెలోకి 20 వేల మంది ఉద్యోగులు
  •  అవసరమైతే మెరుపు సమ్మె : విద్యుత్ ఉద్యోగులు
  •  సాక్షి, విజయవాడ : మరోసారి సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సన్నద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్జీవో సంఘం నేతలు కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులకు సమ్మె ఆవశ్యకతను వివరించారు. బుధవారం నుంచి రెవెన్యూ, నీటిపారుదల, రవాణా, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వ్యవసాయశాఖతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోనున్నాయి.  

    రబీ పంట నడుస్తున్నందున నీటి పారుదల శాఖలో అధికారులు, రెగ్యులేటర్లను పర్యవేక్షించే కొంతమంది మాత్రమే విధుల్లో ఉండనున్నారు. రెవెన్యూ సిబ్బంది ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. ట్రెజరీ, వాణిజ్యపన్నులశాఖలో కొంతమంది ఉద్యోగులు మాత్రం సమ్మెకు దూరంగా ఉంటున్నారు.  మెరుపు సమ్మెకు దిగేందుకు వెనుకాడేది లేదని విద్యుత్ జేఏసీ ప్రకటించింది. సమ్మెకు దూరంగా ఉంటూ ఆందోళనలకు సహకరించాలని  ఆర్టీసీ  నిర్ణయించింది. మున్సిపల్ ఉద్యోగులు సమ్మెపై నిర్ణయం తీసుకోలేదు. గురు, శుక్రవారాల్లో విధులు బహిష్కరించాలని నిర్ణయించారు.      
     
    పీఆర్‌టీయూ సంఘీబావం

    సీమాంధ్ర ప్రాంత విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తాము  సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నట్లు సమైక్య పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నారాయణరావు తెలిపారు. పటమటలోని సమైక్య పి.ఆర్.టి.యు కార్యాలయంలో బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయ పాఠశాల పనిగంటల తరువాత ఏపీఎన్జీవోలతో, సమైక్యాంధ్ర సాధన ఉద్యమ పార్టీలతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.  ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రెడ్డెమ్మ పాల్గొన్నారు.
     
    వాణిజ్య పన్నుల శాఖ దూరం

     
    విజయవాడ సిటీ : సమ్మెకు దూరంగా ఉండాలని వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు తీర్మానించారు. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఎన్‌జీఓ అసోయేషన్ విజయవాడ 1, 2 డివిజన్‌ల  కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి హాజరైన కొందరు ఉద్యోగులు మాట్లాడుతూ  గతంలో 66 రోజుల సమ్మెకాలంలో నష్టపోయామని, ఈ పరిస్థితిలో సమ్మెలో పాల్గొనలేమని  తీర్మానం చేసి రాష్ట్ర నాయకత్వానికి పంపారు.
     

మరిన్ని వార్తలు