శ్రీవారికి కానుకల అభిషేకం

9 Sep, 2019 04:53 IST|Sakshi

5 నెలల్లో రికార్డుల మోత

గణనీయంగా పెరిగిన బంగారు, వెండి కానుకలు, హుండీ ఆదాయం  

తిరుమల: కలియుగ వైకుంఠ నాథుడి ప్రాశస్త్యం దశదిశలా వ్యాపిస్తుండడం, శ్రీవారి పట్ల భక్తులకు ఉన్న అపారమైన నమ్మకం వెరసి ఏడుకొండల వాడికి కానుకల అభిషేకం జరుగుతోంది. గడిచిన 5 నెలల్లో శ్రీవారికి వస్తున్న కానుకలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. టీటీడీకి వస్తున్న బంగారం, వెండి కానుకలు, హుండీ ఆదాయం అమాంతంగా పెరుగుతోంది. స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. గతంలో స్వామి వారి దర్శనానికి సాధారణ రోజుల్లో 25 వేల మంది, సెలవు రోజుల్లో 50 వేల మంది వరకు వచ్చేవారు. ఇప్పుడు సాధారణ రోజుల్లో 65æ నుంచి 75 వేల మంది వరకు, సెలవు రోజుల్లో లక్ష మంది వరకు భక్తులు వస్తున్నారు. 20 సంవత్సరాల కిందట శ్రీవారికి ఏడాదికి లభించే హుండీ ఆదాయం వంద కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు అది వేల కోట్లకు చేరుకుంది. దాంతో పాటు బంగారం, వెండి కూడా వేల కేజీలు కానుకలుగా భక్తులు సమర్పిస్తున్నారు. 

5 నెలల్లో రికార్డు స్థాయిలో..
శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న కానుకలు ఏటికేడూ పెరుగుతూనే ఉండగా.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 5 నెలల్లోనే గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ వరకు 5 నెలల కాలంలో టీటీడీ నిర్వహిస్తున్న పథకాలకు భక్తులు రూ. 114 కోట్ల విరాళాన్ని సమర్పించగా.. ఈ ఏడాది రూ. 141 కోట్లు అందించారు. గత ఏడాది శ్రీవారి హుండీకి 1,128 కేజీల వెండి కానుకలుగా సమర్పించగా.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,098 కేజీల వెండి హుండీలో చేరింది. అత్యధికంగా మే నెలలో 1,267 కేజీల వెండి శ్రీవారికి అందింది. గతేడాది 5 నెలల్లో 344 కేజీల బంగారాన్ని భక్తులు సమర్పించగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 525 కేజీల బంగారం హుండీలో చేరింది. అలాగే గత ఏడాది 5 నెలల్లో రూ. 450.54 కోట్ల రూపాయల హుండీ ఆదాయం శ్రీవారికి లభిస్తే, ఈసారి రూ. 497.29 కోట్లు స్వామివారి ఖజానాలో చేరింది. 

మానవ సేవే మాధవ సేవ 
మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో టీటీడీ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేదలకు ఉన్నత విద్య, ఆధునిక వైద్యం అందిస్తోంది. భక్తులు సమర్పించిన విరాళాలు, హుండీ కానుకలను టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు వినియోగిస్తాము. భక్తులకు సౌకర్యాల కల్పనకు, భద్రతకు, తిరుమలను శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం. 
– ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా