గ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత

26 Dec, 2019 09:23 IST|Sakshi
మూతపడిన శ్రీవారి ఆలయం

గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శనానికి అనుమతి

సాక్షి, తిరుపతి: సూర్యగ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసి ఉంచుతున్నారు. ఆలయ శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం గురువారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను (ప్రొటోకాల్‌ దర్శనాలు కూడా) రద్దుచేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును కూడా బుధవారం రాత్రి 11 గంటలకు మూసివేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భవనాన్ని తెరుస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. 

శ్రీశైల ఆలయం మూత
సూర్యగ్రహణం సందర్భంగా  శ్రీశైల ఆలయ మహాద్వారాలను బుధవారం రాత్రి 10 గంటలకు మూసివేసినట్లు ఈఓ కేఎస్‌ రామారావు తెలిపారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ఆలయద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, సుప్రభాత సేవ,  స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, అనుబంధ ఆలయాలను గురువారం ఉదయం 8 గంటల నుంచి 11.10 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో తెలిపారు. శుద్ధి అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని బుధవారం రాత్రి 8 గంటలకు మూసివేసినట్లు ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్‌ శర్మ తెలిపారు. గ్రహణం వీడిన అనంతరం శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించి గురువారం సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయ తలుపులు తెరుస్తామని చెప్పారు.

నేడు శ్రీకాళహస్తిలో గ్రహణకాల అభిషేకాలు 
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తిలో వెలసిన వాయులింగేశ్వరుని ఆలయంలో గురువారం సూర్యగ్రహణం సందర్భంగా ప్రత్యేక గ్రహణకాల అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం తెలిపారు. 

మరిన్ని వార్తలు