ముగిసిన సూర్యగ్రహణం

26 Dec, 2019 09:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన సూర్యగ్రహణం ముగిసింది. నేటి (గురువారం) ఉదయం 8 గంటల 8నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం.. ఉదయం 11 గంటల 11నిమిషాలకు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సప్తవర్ణాలతో సూర్యుడు వీక్షకులకు కనువిందు చేశాడు. పలుచోట్ల జాగ్రత్తలు పాటిస్తూ.. అంతరిక్ష ఔత్సాహికులు సూర్యగ్రహాణాన్ని వీక్షించారు. మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో ఈ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇది మూడో సూర్యగ్రహణం. మూడు గంటలకుపైగా గ్రహణం కొనసాగుతుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్‌, సౌదీ, సింగపూర్‌ దేశాల్లో సూర్యగ్రహణం కనిపిస్తోంది. సంపూర్ణ గ్రహణం సమయంలో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. ఆ సమయంలో చందమామ చుట్టూ సూర్యజ్వాలలు కనిపించనున్నాయి. హైదరాబాద్‌లో ముప్పావు వంతు మాత్రమే సూర్యగ్రహణం కనిపిస్తుంది.

కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. కోయంబత్తూర్, పాలక్కాడ్, మంగుళూరు, పిళికుల్ల, ఉడిపి ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం పాక్షికంగానే కనిపించనుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సూర్యగ్రహణ ప్రభావం అంతగా ఉండదు. ఈ ఏడాదికాలంలో ఇది మూడో సూర్యగ్రహణం.

తిరిగి తెరుచుకోనున్న ఆలయాలు
సూర్యగ్రహణం ముగియడంతో సంప్రోక్షణ అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం రాత్రి 11 గంటలకు శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను మూసివేశారు. 13 గంటలపాటు మూసివేసిన శ్రీవారి ఆలయ తలుపులు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తెరుచుకోనున్నాయి. ఆలయ సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తుల కోసం శ్రీవారి సర్వదర్శనం ప్రారంభం కానుంది. అధిక రద్దీ నేపథ్యంలో సర్వదర్శనం మినహా అన్ని దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలనూ పూర్తిగా రద్దు చేసింది. సూర్యగ్రహణం సందర్భంగా నేడు తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

సూర్యగ్రహణం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయాన్ని మూసివేశారు. నిన్నరాత్రి 8 గంటల నుంచి దర్శనాలు నిలిపివేశారు. ఇవాళ ఆలయ శుద్ధి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. 3 గంటల నుంచి వ్రతాలు, దర్శనాలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని సైతం అర్చకులు  మూసివేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆలయాన్ని అర్చకులు తిరిగి తెరవనున్నారు. సంప్రోక్షణ అనంతరం 3:30 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయాన్ని, చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని మూసిశారు. గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి.. ఈ ఆలయాలు తిరిగి తెరువనున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు