విషజ్వరాలకు ఇద్దరు చిన్నారుల బలి

28 Nov, 2013 06:42 IST|Sakshi

పర్చూరు, న్యూస్‌లైన్ : విషజ్వరాల కారణంగా రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. స్థానిక ఇందిరాకాలనీకి చెందిన ఆరు నెలల చిన్నారి కప్పిరి లాస్య, మూడేళ్ల బాలుడు రాపూరి గణేశ్‌లు విషజ్వరాల బారిన  పడి మృతి చెందారు. లాస్యకు వారం రోజుల క్రితం జ్వరంతో పాటు శరీరంపై దద్దుర్లు రావడంతో స్థానిక ఆర్‌ఎంపీకి చూపించారు. అనంతరం చిలకలూరిపేట, గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ చికిత్స పొందుతూ 26వ తేదీ మధ్యాహ్నం మృతి చెందినట్లు మృతురాలి తల్లిదండ్రులు సీతారామస్వామి, శ్రావణి పేర్కొన్నారు. పాప మృతి చెందిన ఆవేదనలో వైద్య నివేదికలు అక్కడే పడేసి వచ్చినట్లు తెలిపారు. లాస్య విషజ్వరంతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే కాలనీకి చెందిన కావూరి గణే శ్ అనే మూడేళ్ల బాలుడు కూడా సోమవారం రాత్రి మృతి చెందాడు. వారం రోజులుగా గణేశ్ జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు బాపట్ల ప్రభుత్వాస్పత్రిలో చూపించారు. ప్రయోజనం లేకపోవడంతో చీరాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అక్కడి వైద్యుల సూచన మేరకు గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పేదరికంలో ఉన్నా * 50 వేలకు పైగా ఖర్చు చేశామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషజ్వరంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు.

మరిన్ని వార్తలు