డెంగీ జ్వరమే కదా.. అని తేలికగా తీసుకున్నారో.. ఇక అంతే!!

15 Sep, 2023 10:56 IST|Sakshi

విషజ్వరంతో ఇద్దరు మహిళలు మృతి!

డెంగీతో ఆరు నెలల పాప..

మహబూబాబాద్‌: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని(35) విషజ్వరంతో బుధవారం రాత్రి చనిపోయింది.

రజని వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానిక ఆర్‌ఎంపీల వద్ద నాలుగు రోజులు వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. దీంతో ఏటూరునాగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ పరీక్షలు చేసి టైఫాయిడ్‌గా తేల్చారు. మెరుగైన వైద్యం నిమిత్తం ములుగు వెళ్లాలని సూచించడంతో ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లారు. రజిని చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరో మహిళ..
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌లో ఉంటున్న మనీష(30) రాఖీ పండుగ సందర్భంగా వాజేడు మండల పరిధిలోని మొరుమూరు కాలనీ గ్రామానికి వచ్చింది. ఆమె ఇక్కడికి జ్వరంతోనే వచ్చింది. స్థానికంగా వైద్యం చేయించుకున్నా తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌ తీసుకెళ్లినట్లు సమాచారం.

ఆరు నెలల పాప..
వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎస్‌కే.గౌస్‌– సహర దంపతుల కుమార్తె మినహ(6నెలలు) డెంగీ జ్వరంతో బాధపడుతూ వారంరోజుల నుంచి ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలించగా గురువారం చనిపోయినట్లు తండ్రి గౌస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు