సమైక్యశక్తి

16 Sep, 2013 01:23 IST|Sakshi

సమైక్య ఉద్యమ సెగలు మిన్నంటుతున్నాయి. రోజురోజుకూ ఉద్యమానికి మద్దతు పెరుగుతుండటంతో సమైక్యశక్తి బలీయమవుతోంది. విజయవాడలో మలయాళీలు ఉద్యమానికి మద్దతుగా ఓనం వేడుకలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మానవహారాలు, వినూత్న నిరసనలు ఆదివారమూ కొనసాగాయి.
 
 సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో జరుగుతున్న ఉద్యమం మరింత బలపడుతోంది. ఉద్యమం ప్రారంభించి ఆదివారానికి 48 రోజులకు చేరినా జోరు తగ్గలేదు. సమైక్యాంధ్రను కాపాడుకోవడానికి మరింత ఉధృతంగా ఉద్యమం కొనసాగించేందుకు సమైక్యవాదులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 17న ప్రైవేటు ఆస్పత్రులు బంద్ పాటిస్తుండగా, 18న  సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కోసం ర్యాలీలు, 20న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ, 21న హనుమాన్‌జంక్షన్‌లో రైతుగర్జన నిర్వహించాలని నిర్ణయించారు.

 పెరుగుతున్న మద్దతు..

 సమైక్యాంధ్రకు తెలుగువారే కాకుండా ఈ ప్రాంతంలో స్థిరపడిన వివిధ రాష్ట్రాలకు చెందినవారు కూడా తమ వంతు మద్దతు తెలుపుతున్నారు. దశాబ్దాలుగా విజయవాడ నగరంలో స్థిరపడిన మలయాళీలు ఏటా ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఓనం వేడుకలను సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దుర్గగుడికి వచ్చిన కాకినాడ శ్రీపీఠానికి చెందిన శ్రీ పరిపూర్ణానందస్వామి రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొని ఉందని, దీని కోసం శాంతి కమిటీని వేయాలని సూచించారు. మరోవైపు ఆదివారం కూడా ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. విజయవాడలో ఐసీడీఎస్ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలని కోరుతూ న్యూ రాజరాజేశ్వరీపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన జరిపారు. కేంద్రమంత్రుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ ఎదుట మంత్రుల రాజీనామాలు కోరుతూ 108 కొబ్బరికాయలు కొట్టారు.

మాజీ మంత్రి  సుభాష్‌చంద్రబోస్ మద్దతు..

 నందివాడ మండలం జనార్థనపురం శివారు టెలిఫోన్ నగర్ కాలనీలో మండల ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 15వ రోజుకు చేరాయి. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కిసాన్ సెల్ కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డితో కలసి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శిబిరంలో  దీక్ష చేస్తున్న తుమ్మలపల్లి రైతులకు సంఘీభావం తెలిపారు. సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు ఎడారిగా మారటం ఖాయమని ఈ సందర్భంగా బోస్ అన్నారు. తొలుత ఉపాధ్యాయులు ఎంఎన్‌కే రహదారిపై సమైక్యాంధ్రకు మద్దతుగా చెవిలో పూలతో భజన కార్యక్రమం నిర్వహించారు.

పునాదిపాడు-కంకిపాడు సెంటరు వరకు రోడ్ రోలర్స్ అసోసియేషన్, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్స్ ర్యాలీ నిర్వహించారు. గన్నవరం రోడ్డు కూడలిలో మానవహారం నిర్మించారు. పామర్రు నాలుగురోడ్ల కూడలిలో రిమ్మనపూడి పంచాయతీ పాలకవర్గ సభ్యులు రిలేదీక్షల్లో కూర్చున్నారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో, మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. నెహ్రూచౌక్‌లో టైలర్స్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు.

గుడ్లవల్లేరులో పాలిటెక్నిక్ విద్యార్థులు రిలేదీక్షలకు కూర్చున్నారు. తిరువూరు మండలంలోని పలు గ్రామపంచాయతీ సర్పంచులను కలిసిన జేఏసీ నాయకులు సమైక్యాంధ్ర కోసం పంచాయతీ తీర్మానాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వస్తే అధిష్టానాన్ని ధిక్కరించి సమైక్యాంధ్రకు అనుకూలంగా ఓటు వేస్తానని తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి ప్రకటించారు.

 తాళ్లతో బస్సులు లాగి నిరసన..

 విస్సన్నపేట మండల జేఏసీ నాయకులు ఆర్టీసీ అద్దె బస్సులను తాళ్లతో లాగి నిరసన తెలిపారు. రాష్ట్రం విడిపోతే ఆర్టీసీ పరిస్థితి కుదేలవుతుందని, బస్సుల్ని నడపలేక, కార్మికులకు జీతాలివ్వలేక తీవ్ర ఇబ్బందికర స్థితిలోకి ఆర్టీసీ దిగజారుతుందని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పామర్రులోని ఆర్యవైశ్య యువజన సంఘం, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి సుదర్శన హోమం నిర్వహించారు. జగ్గయ్యపేట జేఏసీ ఆధ్వర్యంలో పేట నుంచి తిరుమలగిరి వరకు పాదయాత్ర నిర్వహించారు.

పాదయాత్రలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్‌లు పాల్గొని సంఘీభావం తెలిపారు.  కైకలూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు 40వ రోజుకు చేరాయి. ఎన్‌జీవో సంఘం ఆధ్వర్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మోపిదేవిలో డ్వాక్రా మహిళలు దీక్ష చేశారు. గన్నవరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతృత్వంలో జరుగుతున్న రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి.

 కైకలూరులో ముస్లిం చిన్నారుల  ఆందోళన...

 కైకలూరు పట్టణంలో ముస్లిం చిన్నారులు జేఏసీ ఆధ్వర్యంలో పామర్రు-కత్తిపూడి 214 జాతీయ రహదారిపై బైఠాయించి దువా (ప్రార్థన) చేసిన అనంతరం సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గుర్వాయిపాలెం సెంటరులో యూత్ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో చేశారు. మచిలీపట్నంలో మునిసిపల్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 33వ రోజుకు చేరింది. కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారి పక్కన ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్‌లో రిలేదీక్షలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు