మూడో విడత నిరాశే !

21 Aug, 2015 02:04 IST|Sakshi
మూడో విడత నిరాశే !

ఆరుగాలం కష్టపడడమే తప్ప.. ఎవరికీ హాని తలపెట్టడం తెలియని గిరిజన రైతులతో సర్కార్ ఆటలాడుతోంది. ఉద్యానవనాల పేరుతో తీసుకున్న రుణాలను మాఫీ చేయకుండా వారిని ఆందోళనకు గురిచేస్తోంది. రుణమాఫీలో ప్రభుత్వం మూడో  విడతలోనూ గిరిజన రైతులకు మొండిచేయి చూపడంతో లబోదిబో మంటున్నారు. మొదటి, రెండో విడతలో ఎలాగు రుణమాఫీ జాబితాలో పేర్లు లేవు. కనీసం మూడో విడతలోనైనా పేర్లు ఉంటాయనుకుంటే అది కూడా నిరాశేమిగిలిందని గిరిపుత్రులు వాపోతున్నారు.
- ఉద్యానవనాల పేరుతో తీసుకున్న రుణాలకు మాఫీ లేదు
- ఆందోళనలో గిరిజన రైతులు
సీతంపేట:
రుణమాఫీపై ఆశలు పెట్టుకున్న గిరిపుత్రులు ఇటీవల వచ్చిన జాబితాను చూసి నివ్వెరపోయారు. రెండో విడతలో కేవలం 24 మంది రైతుల పేర్లు మాత్రమే రుణమాఫీలో ఉండడంతో అప్పట్లో కంగుతిన్నారు. మూడో విడత కోసం ఏదురు చూసి గిరిజన రైతులంతా ఆందోళన చెందుతున్నారు.

సీతంపేట మండలంలో పదివేల మంది రైతులు ఉన్నారు. వీరిలో వివిధ పంటల రుణాల కింద సుమారు 5,600 మంది రుణాలు తీసుకున్నారు. స్థానిక ఆంధ్రాబ్యాంకు, ఎస్వీజీబీ, ఎస్‌బీఐ, కుశిమి ఇండియన్ బ్యాంకులల్లో వీరంతా రుణాలు పొందారు. మొదటి విడతలో కేవలం 445 మందికి రుణమాఫీ అయ్యింది. అదికూడా ఒకొక్కరికీ రూ. 10 వేల లోపే. రెండోవిడతలో మరో 24 మందికి మాత్రమే మాఫీ వర్తించింది. తాము ఖరీఫ్ రుణం 2012లో తీసుకున్నప్పటకీ ఇప్పటి వరకు రూపాయి కూడా మాఫీ కాలేదని అక్కన్నగూడకు  చెందిన సుక్కయ్య, జమ్మయ్య, లక్కమ్మ, సరస్వతి సవరబోయడు, సవర ముంజు, తిక్కమై  తదితరులు వాపోతున్నారు. కుశిమి ఇండియన్ బ్యాంకు ద్వారా అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ రుణమాఫీ కాకపోవడం గమనార్హం.
 
ఉద్యానవన పంటల రైతులకు మాఫీ లేనట్టేనా?
గిరిజన ప్రాంతాల్లో ఉద్యానవన రైతులకు రుణమాఫీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఏజెన్సీలో ఎక్కువగా కొండపోడు పంటలే ఆధారంగా జీడిమామిడి, పసుపు, అల్లం, కంది, అరటి తదితర పంటలు పండిస్తారు. రుణం తీసుకున్నవారంతా చిన్నరైతులే. ఒక్కో గిరిజన రైతు రూ.30 వేల లోపే రుణం తీసుకున్నారు. ఇంత తక్కువ మొత్తాల్లో రుణాలు తీసుకున్నా మాఫీ కాకపోవడంపై గిరిజనులు అసంతృప్తి చెందుతున్నారు. శంబాం, కోడిశ, కుశిమి, కడగండి,  కుడ్డపల్లి, కొండాడ, టిటుకుపాయి, మండ, కిల్లాడ, పెదపొల్ల పంచాయతీల పరిధిలో రైతులకు రుణమాఫీ జరగలేదు. ఈ విషయాన్ని వ్యవసాయాధికారి జ్ఞానేంద్రమణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మూడో విడతలో ఎవరి పేర్లూ రుణమాఫీ జాబితాలో లేవని స్పష్టం చేశారు. ఉద్యానవన పంటలకు మాఫీ వస్తే చాలా మందికి వర్తిస్తోందన్నారు.
 
నిరాశే మిగిలింది
గిరిజనులకు నిరాశేమిగిలింది. రెండు విడతల్లో రుణమాఫీ జరగలేదు.  కనీసం మూడో విడతోనైనా జరుగుతుందని ఎదురు చూసిన రైతాంగానికి న్యాయం జరగలేదు. కొండపోడు పట్టాలకు రుణమాపీ తప్పనిసరిగా చేయాలి.  
- సవరగోపాలు, సర్పంచ్, సోమగండి
 
ఖరీఫ్ సాగేలా చేయాలి
రుణమాఫీ జరగకపోవడంతో ప్రస్తుతం వరిపంటను ఎలా పండించాలి. మిగతా పంటలు కూడా పండించలేని పరిస్థితి ఉంది. బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి మొగ్గు చూపడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలి.
 - సవర బెన్నడు, అక్కన్నగూడ, గిరిజన రైతు

>
మరిన్ని వార్తలు