వాసవీ అమ్మవారి పంచలోహ విగ్రహ ప్రతిష్ట

16 Feb, 2019 09:55 IST|Sakshi
వాసవీ కన్యకాపరమేశ్వరి 90 అడుగుల పంచలోహవిగ్రహం

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో కార్యక్రమం

పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవీ శాంతిధాం 102 రుషీగోత్ర స్తంభ మందిరంలో ఏర్పాటు చేసిన 90 అడుగుల శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన శుక్రవారం వైభవంగా జరిగింది. జీఎంఆర్‌ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు దంపతులు అమ్మవారి విగ్రహావిష్కరణ చేసి తొలి అభిషేకం చేశారు. వాసవీ శాంతి ధాంలో 700 రోజుల పాటు శ్రమించి 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకు 42 టన్నుల రాగి, 20 టన్నుల జింకు, 1.3 టన్నుల తగరం, 600 కేజీల వెండి, 40 కేజీల బంగారం కలిపి 65 టన్నుల విగ్రహాన్ని తయారు చేశారు.

డిసెంబర్‌ 4న ప్రారంభమైన ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11 నుంచి హోమ క్రతువులు, నిత్య కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం 102 ఆర్యవైశ్యుల గోత్రీకులకు చిహ్నంగా 102 స్తంభాల రుషీగోత్ర మందిరాన్ని ప్రారంభించారు. అరుదైన మరకత శిలతో చెక్కించిన 3 అడుగుల మరకత శిలా విగ్రహాన్ని ప్రతిష్టించి అభిషేకాలు నిర్వహించారు. ట్రస్ట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పీఎన్‌ గోవిందరాజులు ఆధ్వర్యంలో జరిగిన ఆర్యవైశ్యుల ఇలవేల్పు వాసవీ కన్యకాపరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించడానికి కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్యవైశ్యులు వేలాదిగా తరలి వచ్చారు.

మరిన్ని వార్తలు