వేదం.. జీవననాదం

16 Oct, 2014 03:46 IST|Sakshi

తిరుమల: భారతీయుల జీవనశైలి వేద ప్రామాణికమైందని, వేదం జీవన నాదంగా కొనసాగాలని కంచి మఠం స్వామి విజయేంద్ర సరస్వతి ఉద్ఘాటించారు. తిరుమల ధర్మగిరిలోని శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో ఈ నెల పదో తేదీ నుంచి బుధవారం వరకు వరకు జరిగిన వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన విజయేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేశారు. టీటీడీ వైదిక ధార్మిక కార్యక్రమాలను కొన్ని దశాబ్దాలుగా ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని ప్రశంసించారు. వేద పారాయణధారులు ధనం, ప్రఖ్యాతుల కోసం ఎప్పుడూ ఆశపడరని, విజ్ఞానం కోసం కృషి చేస్తారని అన్నారు.  

వేదం జీవననాదంగా కొనసాగితే దేశం పరమ సుభిక్షమవుతుందన్నారు. అంతకుముందు మహాపాధ్యాయ తాతాచార్య మాట్లాడుతూ 1968 నుంచి వేద శాస్త్ర ఆగమ సంరక్షణ కోసం టీటీడీ వైదిక విద్య, శ్రౌతయాగాలు, చతుర్వేద హవనాలు నిర్వహిస్తోందన్నారు. టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ మాట్లాడుతూ వేద విద్య వ్యాప్తి కోసం టీటీడీ నిత్యం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అఖిలభాతర వేద విద్వత్ సదస్సును శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు తెలిపారు.

వేద విద్య పారాణయదారులను ప్రోత్సహించేందుకు 2010 నుంచి క్రమాపాఠీలు, ఘనాపాఠీలకు, వృద్ధ పండితులను గుర్తించి ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వేద పారాయణదారులకు ఇస్తున్న రూ.12 వేలను రూ.16 వేలకు, ఘనాపాఠీలకు ఇస్తున్న రూ.13 వేలను రూ.17 వేల కు, వృద్ధ పండితులకు ఇస్తున్న రూ.8 వేలను రూ.10 వేలకు పెంచనున్నట్లు ఈవో వెల్లడిం చారు. దీనిపై తర్వలో జరగనున్న టీటీడీ స్పెసిఫైడ్ అథారటీ సమావేశంలో చర్చిస్తామన్నారు. ప్రస్తుతం నిర్వహించిన వేద విద్వత్ సదస్సులో ఉత్తీర్ణులైన 180 మందిని అభినందిస్తున్నట్లు చెప్పారు.

అంతకుముందు ‘శృతివివేచనం’ అనే పుస్తకాన్ని కంచి పీఠం స్వామితో కలసి ఈవో ఎంజీ గోపాల్ ఆవిష్కరించారు. అనంతరం ఉత్తీర్ణులైన విద్యార్థులను, పరీక్షాధికారులను సన్మానించారు. జేఈవో శ్రీనివాసరాజు, ఎస్వీ.వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి కేఈ.దేవనాథన్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య హరేకృష్ణ శతపతి, వేద విజ్ఞానపీఠం ప్రిన్స్‌పాల్ అవధాని, ఇతర పండితులు, అధ్యాపకులు, వేద విద్యార్థులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు