బండికీ ఆధార్‌ం

29 Nov, 2014 01:22 IST|Sakshi
బండికీ ఆధార్‌ం

ఆర్టీఏ అనుసంధాన ప్రక్రియ
పెలైట్ ప్రాజెక్టుగా గుడివాడ ఎంపిక
సోమవారం నుంచి ఇంటింటి సర్వే
డ్వాక్రా మహిళలతో  నిర్వహణ

 
గుడివాడ : వాహనాల భద్రత, వ్యక్తిగత భద్రత పేరుతో ఆర్టీఏ  చేపట్టిన వాహనాలకు ఆధార్ అనుసంధానం పెలైట్ ప్రాజెక్టుగా గుడివాడ ఎంపికయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండుచోట్ల పెలైట్ ప్రాజెక్టులుగా ఎంచుకోగా రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల పట్టణాన్ని, కోస్తా జిల్లాల్లో  గుడివాడ పట్టణాన్ని పెలైట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు. ఇందుకోసం సోమవారం నుంచి డ్వాక్రా  మహిళల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు.

36 వార్డుల్లో సర్వే..

గుడివాడ పట్టణాన్ని ఆధార్ అనుసంధానానికి పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో ఆర్టీఏ శాఖ ఉన్నతాధికారులు సైతం కదలి వచ్చి యుద్ధప్రాతిపధికన సర్వే పనులపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర జాయింట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ కమిషనర్ ప్రసాదరావు స్వయంగా వచ్చి డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చారు. గుడివాడ పట్టణంలో ఉన్న 36 వార్డుల్లో ఈసర్వే చేయాల్సి ఉంది. ప్రతి వార్డుకు ఇద్దరు చొప్పున డ్వాక్రా మహిళలు  ఇంటింటి సర్వేచేసి వాహనం నంబరు, వాహనదారుని పేరు, వాహన దారుడి ఆధార్ నంబరు, ఫోన్ నంబరు సేకరించాల్సి ఉంది. అలాగే లెసైన్సు ఉంటే లెసైన్సు దారుడు పేరు లెసైన్సు నంబరు లేదా రిఫరెన్స్ నంబరు, లెసైన్స్ దారుడి ఫోన్ నంబరు వీరు సేకరించాలి. ఒక్కో వాహనదారుడి  వివరాలు సేకరించినందుకు     రూ.8  చెల్లిస్తుంది.  వివరాలను ఏరోజుకు ఆరోజు కంప్యూటరీకరించాల్సి ఉంది. ఇలా ప్రతి అడ్రస్సు కంప్యూటరీకరించినందుకు మరో రూ.3 చెల్లిస్తారు.

ఉపయోగం ఏమిటంటే..

ఆధార్ అనుసంధానం చేయడం వల్ల వాహనం నంబరు ఆన్‌లైన్‌లో చూడగానే యజమాని పూర్తి వివరాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ వాహనానికి ఆధార్ అనుసంధానం చేస్తే ఆదాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని వాహన యజమానులు అనుమానిస్తున్నారు. దీంతో డ్వాక్రా సభ్యులకు వాహన యజమానులు ఎంతవరకు సహకరిస్తారో వేచిచూడాల్సిందే.
 

మరిన్ని వార్తలు