ఎర్రబెల్లి వర్సెస్ స్పీకర్!

29 Nov, 2014 01:22 IST|Sakshi
ఎర్రబెల్లి వర్సెస్ స్పీకర్!

రేవంత్‌కు మైక్ ఇవ్వకపోవడంపై టీడీపీ పక్ష నేత వాదులాట
బిల్లుపై మాట్లాడనీయకుండా రేవంత్‌ను అడ్డుకున్న టీఆర్‌ఎస్ సభ్యులు
టీడీపీ వాకౌట్, ఏ అభిప్రాయం చెప్పకుండా తిప్పించుకునే వ్యూహం
 

 సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఆ పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. గురువారం సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడిన తర్వాత.. తాను మాట్లాడేందుకు రేవంత్‌రెడ్డి లేచారు. యథావిధిగా టీఆర్‌ఎస్ సభ్యులు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ గొడవకు దిగారు. స్పీకర్ కల్పించుకొని ‘ఫ్లోర్ లీడర్లే మాట్లాడాలి. దయాకర్‌రావుగారూ... మీరు మాట్లాడండి’ అని రేవంత్ మైక్ కట్ చేశారు. దీంతో రేవంత్‌రెడ్డి ‘ఇదేం అన్యాయం అధ్యక్షా.. శాసనసభ నిబంధనల్లో ఏముందో మీకు తెలియజేశాం. క్షమాపణ చెప్పాలని ఎక్కడుంది..’ అంటూ ఏదో చెప్పబోయారు. ఇదేమీ పట్టించుకోకుండా దయాకర్ రావును మాట్లాడాలని లేదంటే లక్ష్మణ్ (బీజేపీ) మాట్లాడాల్సి వస్తుందని స్పీకర్ స్పష్టంచేశారు. తర్వాత లక్ష్మణ్‌కు మైక్ ఇచ్చారు. మాట్లాడేందుకు లక్ష్మణ్ ఉద్యుక్తుడు కాగానే.. రేవంత్‌రెడ్డి, దయాకర్ రావు ఇద్దరూ లేచి స్పీకర్‌తో వాదించడం మొదలుపెట్టారు.
 
 ఈ సందర్భంగా బీజేపీ పక్ష నేత లక్ష్మణ్‌పైనా రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మిత్రపక్షమై ఉండి, మాకు అవకాశం ఇవ్వకపోతే సపోర్టు చేస్తారా? మీరే మాట్లాడుతారా?’ అని ప్రశ్నించారు. స్పీకర్ కల్పించుకొని లక్ష్మణ్ మాట్లాడకపోతే... అక్బరుద్దీన్‌కు అవకాశం ఇస్తానని చెప్పారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించుకుని.. ‘రేవంత్‌రెడ్డి దళిత సభ్యుడిని పట్టుకొని బూట్లు నాకుతావా అని అన్నడు. అది రికార్డుల్లో ఉంది’ అని అన్నారు. ‘రేవంత్‌రెడ్డి తప్పుగా మాట్లాడితే స్పీకర్‌గా మీరే నిర్ణయం తీసుకున్నా దానికి సిద్ధమని చెప్పాం. మీరు రూలింగ్ ఇవ్వండి. కానీ సభ్యుడికి మాట్లాడే హక్కును లేకుండా చేయడం ఏంటి’ అని స్పీకర్‌తో ఎర్రబెల్లి అన్నారు. దీంతో స్పీకర్ మధుసూదనాచారి కల్పించుకుంటూ ‘బూట్లు నాకడం’ అనే పదం రికార్డుల్లో ఉందని పేర్కొన్నారు. ‘అలా ఉంటే ఫ్లోర్‌లీడర్లను పిలిచి మాట్లాడి మీరు ఏ రూలింగ్ ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటం. తప్పు చేసినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధం’ అని ఎర్రబెల్లి చెప్పారు. సభ్యులను తాను శిక్షించనని, మాట్లాడిన సభ్యుడి విజ్ఞతకే వదిలేస్తానని స్పీకర్ పేర్కొన్నారు. అనంతరం టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు.  
 
 సభ్యులకు విప్ జారీ చేసినా..
 ద్రవ్య వినిమయ బిల్లు విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఫ్లోర్‌లీడర్లు మాత్రమే మాట్లాడాలని స్పీకర్ పదేపదే చెపుతున్నా రేవంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని దయాకర్ కోరినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి మాట్లాడడాన్ని అధికారపక్ష సభ్యులు ఒప్పుకోరు కాబట్టి, వాకౌట్ చేయడం ద్వారా బిల్లుకు ఆమోదం తెలపడమా, వ్యతిరేకించడమా అనే సమస్య ఉత్పన్నం కాదని, అందుకే సభ నుంచి బయటకు వెళ్లినట్లు ఓ ఎమ్మెల్యే తెలిపారు.

మరిన్ని వార్తలు