బిజీబిజీగా ఉపరాష్ట్రపతి..

1 Sep, 2019 10:25 IST|Sakshi
రాపూరు : చెర్లోపాళెం వద్ద ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తున్న ఉప రాష్ట్రపతి 

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం జిల్లాకు వచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం నెల్లూరు నగరానికి చేరుకున్నారు. అనంతరం నగరంలోని ఆయన స్వగృహానికి వెళ్లారు. అక్కడి నుంచి కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్‌ అంగడి, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌తో కలి సి వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు ప్రత్యేక రైలులో నూతనంగా నిర్మించిన కృష్ణపట్నం– ఓబులవారిపల్లె రైల్వే సొరంగ మార్గాన్ని పరిశీలించారు. ఆదివారం గూడూరులో విజయవాడ ఇంటర్‌ సిటీ రైలును ప్రారంభించనున్నారు.  

సాక్షి, నెల్లూరు : ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్‌ అంగడితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో శనివారం మధ్యాహ్నం 1.35 గంటలకు నెల్లూరులోని పోలీస్‌ కవాతు మైదానానికి చేరుకున్నారు. వీరికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్, కలెక్టర్‌ శేషగిరిరావు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి, రైల్వే శాఖ సహాయ మంత్రితో కలిసి రోడ్డు మార్గాన సర్దార్‌వల్లభ్‌భాయిపటేల్‌ నగర్‌లోని తన స్వగృహానికి వెళ్లారు. 

ఆందోళనకు గురిచేసిన వాతావరణం
నగరంలో శనివారం ఉదయం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఉపరాష్ట్రపతి పర్యటనకు అవాంతరాలు ఏర్పడతాయేమోనని అందరూ భావించారు. వాతావరణం అనుకూలించని పక్షంలో రోడ్డు మార్గాన రేణిగుంట నుంచి నెల్లూరు తీసుకురావొచ్చని అధికారులు ఆలోచించారు. అందుకు అనుగుణంగా కాన్వాయ్‌ను సిద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అయితే మధ్యాహ్నానికి వాతావరణం బాగుండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, నాయకుడు కర్నాటి ఆంజనేయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు