స్త్రీని కాపాడుకోవాలి

21 Sep, 2014 00:43 IST|Sakshi
స్త్రీని కాపాడుకోవాలి

 ముదితలెందరో.. మిలమిలలతో, తళతళలతో ‘వెన్నెల్లో నిండు గోదారుల్లా’.. మెరిశారు. వేదికను ఇంధ్రధనువుల కొలువుగా మార్చారు. అంతేనా.. కన్ను చూసేదే కాక.. మనసు మెచ్చే అంతస్సౌందర్యమూ తమకుందని  నిరూపించారు. విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి.. ‘శ్రీమతి రాజమండ్రి’ కార్యక్రమం ఓసాంస్కృతిక సంగమమని చాటారు. విక్టరీ ఈవెంట్ మేకర్‌‌ శనివారం రాత్రి రాజమండ్రి రివర్‌బేలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ శ్రీశారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ముఖ్యఅతిథిగా పాల్గొని భారతీయ సంస్కృతిని,
 స్త్రీ ఔన్నత్యాన్ని వివరించారు.
 
 
 అమావాస్య రాత్రుల్లో హఠాత్తుగా పండు వెన్నెల విరిసి.. ఆ కాంతుల్లో నిండు గోదావరి ప్రవహిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అటువంటి దృశ్యమే రాజమండ్రి రివర్ బే హోటల్‌లో శనివారం రాత్రి ఆవిష్కృతమైంది. డాక్టర్ ఎన్‌ఎస్‌ఆర్ ఫౌండేషన్, భాస్కర్ ఎస్టేట్స్ సహకారంతో విక్టరీ ఈవెంట్ మేకర్‌‌స అధినేత విక్టర్ మేడిద ఆధ్వర్యంలో ‘శ్రీమతి రాజమండ్రి’ పేరుతో పరిపూర్ణ వనితల పోటీ-2014 నిర్వహించారు. దీనికి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ జార్జి విక్టర్ అధ్యక్షత వహించారు. పోటీల్లో 16 మంది శ్రీమతులు పాల్గొన్నారు. మూడు రౌండ్లుగా పోటీలు జరిగాయి. మొదటి రౌండ్ పరిచయం కార్యక్రమం, రెండో రౌండ్ టాలెంట్ టెస్ట్, మూడోది జనరల్ నాలెడ్జ్ రౌండ్ నిర్వహించారు.
 
 స్త్రీని కాపాడుకోవాలి
 విశాఖ శ్రీ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుందన్నారు. స్త్రీని, స్త్రీశక్తిని కాపాడుకోవాల్చిన అవసరముందన్నారు. భ్రూణహత్యలు, అత్యాచారాలు రూపు మాపడానికి రాజకీయ నాయకులు కృషి చేయాలన్నారు. స్త్రీమూర్తిని అమ్మవారిగా పూజించే దేశం భారతదేశం ఒక్కటేనన్నారు. విదేశాల్లో స్త్రీని అంగడిబొమ్మగా చూస్తున్నారన్నారు. విదేశీ సంస్కృతి రావడం వల్ల మన దేశంలో మహిళల నుదుట బొట్టు పెట్టుకోని పరిిస్థితి ఏర్పడిందన్నారు.
 
 కట్టు, బొట్టు, జుట్టు మన సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నాలన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు పరిపూర్ణత సాధించాలని, వారు చట్టసభల్లో ప్రవేశించడం ద్వారా స్త్రీల రక్షణకు పదునైన చట్టాలు తీసుకు రావాల్సి ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, మేయర్ పంతం రజనీ శేషసాయి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ గాయకులు గోపికా పూర్ణిమ, మల్లికార్జున దంపతులు తమ గీతాలతో ఆహూతులను అలరించారు.  డీటీఎస్ ఆనంద్ తన గళ విన్యాసంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ కార్యక్రమానికి ఆకాశవాణి అనౌన్సర్ రాంభట్ల నృసింహశర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
 - రాజమండ్రి సిటీ
 

మరిన్ని వార్తలు