ఈఎస్‌ఐ ‘డైరెక్టరేట్‌’పై విజిలెన్స్‌ దాడులు 

8 Oct, 2019 05:18 IST|Sakshi

ఏడు గంటలకుపైగా సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు 

ఓ ఫార్మాస్యూటికల్‌కే మందుల కొనుగోళ్లు ఇవ్వడంపై ఆరా  

మందులు, ఫర్నిచర్‌ తదితరాల కొనుగోలులో భారీగా అవకతవకలు 

సాక్షి, అమరావతి బ్యూరో:  విజయవాడలోని ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు విజిలెన్స్‌ ఎస్పీ జాషువా, విజయవాడ విజిలెన్స్‌ ఎస్పీ వెంకటరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ వరదరాజులు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఆస్పత్రి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. దాదాపు ఏడు గంటలకు పైగా విజిలెన్స్‌ ఎస్పీలు డైరెక్టరేట్‌ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. మందులు, ఫర్నిచర్, సర్జికల్‌ ఐటమ్స్, రీయోజన్స్‌ల కొనుగోలులో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నట్టు తెలిసింది. ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ఆస్పత్రిలో డాక్టర్లు పంపిన ఇండెంట్లకు బదులుగా అధిక కమిషన్‌లు ఇచ్చే మందులను బలవంతంగా కొనుగోలుచేసి.. భారీ మొత్తంలో నిల్వ ఉంచినట్టు సమాచారం. ఈఎస్‌ఐ బడ్జెట్‌ ఎంత? ఎన్ని కొనుగోలు చేస్తారు? వాటిని ఎలా వినియోగిస్తారని విజిలెన్స్‌ అధికారులు ఆస్పత్రి డైరెక్టరేట్‌ కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ మందులను ఏ స్థాయి అధికారి కొనుగోలు చేస్తారన్నదానిపై ఆరా తీశారు.  

చక్రం తిప్పిన ‘ఆమె’ 
గత ప్రభుత్వ హయాంలో ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన మహిళకు చెందిన ఫార్మాస్యూటికల్‌కే మందుల కొనుగోళ్లు ఇచ్చినట్టు విజిలెన్స్‌ తనిఖీల్లో కనుగొన్నారు. రాష్ట్రంలో 16 కంపెనీలున్నా.. ఈ కంపెనీకే ఎందుకు మందుల కొనుగోలు ఇచ్చారనే విషయంపై ఆరా తీశారు. అన్ని సర్జికల్‌ ఐటమ్స్‌ ఒకే ఫార్మాస్యూటికల్‌ కంపెనీకి ఎలా ఇచ్చారనే దానిపై ప్రధానంగా విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. రూ.10 విలువ చేసే మందును రూ.50కి కొనుగోలు చేయాల్సి వచ్చిన విషయాలపై సిబ్బందిని ప్రశ్నించారు. పైగా ఆ ఫార్మా కంపెనీకి తక్షణమే పేమెంట్లు చెల్లించడంపై కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది.

సిరంజిలు వంటివి సైతం నాసిరకమైనవి సరఫరా చేసినట్టు తెలుస్తోంది. వినియోగంలో లేని మందులను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. టెలికేర్‌ అనే సంస్థకు ఒక్కో ఈసీజీకి రూ.450 నుంచి రూ.500 వరకు ప్రభుత్వం నుంచి వసూలు చేసినట్టు తెలుస్తోంది. బయట ఈసీజీని కేవలం రూ.100 నుంచి రూ.120కే తీస్తారు. విజిలెన్స్‌ డీజీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ ఆస్పత్రులపై ఈ దాడులు జరుగుతున్నాయి. డైరెక్టరేట్‌ కార్యాలయం నుంచి 8 వేల పేజీల సమాచారాన్ని తీసుకుని.. దానిని అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు తెలుస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది డైరెక్టర్లు పనిచేశారు.. వారి వివరాలు సైతం సేకరించినట్టు తెలిసింది. మొత్తం మీద ఈఎస్‌ఐలో రూ.కోట్ల  కుంభకోణం జరిగినట్లు స్పష్టమవుతోంది.  

మరిన్ని వార్తలు