పెళ్లయితే మహిళ మగాడి ఆస్తి అవుతుందా?

7 Aug, 2018 04:31 IST|Sakshi

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను ఎందుకు కోర్టుకు లాగకూడదు?

పురాతన భావనలతో మహిళలపై చట్టంలోనే వివక్ష

ప్రైవేటు బిల్లు ద్వారా కీలక అంశాన్ని ఎత్తిచూపిన విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ:  ‘అమ్మాయికి పెళ్లయితే..ఆమె భర్త సొంత ఆస్తి అవుతుందా? ఏకంగా చట్టంలోనే ఈ అర్థం వచ్చేలా ఉండడం ఏంటి?. దాదాపు 160 ఏళ్ల నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో రూపొందించిన సెక్షన్‌ 497 సెక్షన్‌ ద్వారా మహిళను భర్తలు తమ సొంత ఆస్తిలా చూడడమే కాకుండా.. మహిళల ప్రవర్తనను పురుషుడు నియంత్రించేందుకు అవకాశం కల్పించేలా ఉండడం సహేతుకమేనా’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ వి.విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు.

ఈ సెక్షన్‌ను సవరించాలని ఇటీవల ఆయన ప్రైవేటు బిల్లు ప్రతిపాదించారు.  ‘వేరొకరి భార్య అని తెలిసినప్పుడు, లేదా అలా విశ్వసించేందుకు తగిన కారణాలు ఉన్నప్పుడు, అతడి అనుమతి లేకుండా, అతడి ఉపేక్ష మేరకు, ఆమెతో పరాయి పురుషుడు లైంగిక చర్యలో పాల్గొనడం వ్యభిచార నేరమే.. ఇందుకు ఐదేళ్ల వరకు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.. ఇందులో ప్రేరేపించిన వ్యక్తిగా భార్యను శిక్షించజాలం.. ’ అని చెప్పే ఈ సెక్షన్‌లో ‘అతడి అనుమతి లేకుండా’, ‘అతడి ఉపేక్ష మేరకు’ అన్న పదాలను తొలగించాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాకుండా వివాహితను  పురుషుడి సొంత ఆస్తిలా చూడడమనే భావన ఈ సెక్షన్‌లో అంతర్లీనంగా ఉందని, అందువల్లే లింగభేదం లేకుండా సెక్షన్‌ను సవరించాలని ఆయన ప్రతిపాదించారు.

పురాతన భావనలు..
‘వివాహేతర సంబంధాలను ఇండియన్‌ పీనల్‌కోడ్‌(ఐపీసీ)లోని సెక్షన్‌ 497 నేరంగా పరిగణిస్తోంది. అయితే 1860లో రూపొందించిన ఐపీసీ పురాతన భావనలను ప్రాతిపదికగా తీసుకుంది. పురాతన నైతికత ఆధారంగా ఏర్పడ్డ ఈ చట్టాలు మహిళలు, పురుషుల మధ్య సమానత్వాన్ని ఉల్లంఘిస్తున్నందున వీటిని సవరించాలి ’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘భర్త అంగీకారం ఉంటే పరా>యి పురుషుడితో జరిపే శృంగారం చట్టబద్ధమైనదని చిత్రించారు. భార్య లైంగికతను, చర్యలను భర్త ఇష్టానుసారం అని ఈ సెక్షన్‌ చెబుతోంది. భార్య తన భర్తను వివాహేతర సంబంధంపై కోర్టుకు లాగేందుకు అవకాశం ఇవ్వడంలో ఈ సెక్షన్‌ విఫలమైంది..’ అని  వివరించారు.

పితృస్వామ్య వ్యవస్థలా..
‘మహిళల నడవడికను నియంత్రించేలా చట్టంలో ఉన్న ఇలాంటి పితృస్వామ్య భావనలను తొలగించాలి. వివాహ బంధం పవిత్రతను లింగ సమానత్వం ద్వారా కాపాడాలి కానీ.. వివక్ష ద్వారా కాదు. భర్తల చేతుల్లో ఉన్న ఒక వస్తువుగా మహిళను చూసినప్పుడు ఈ సెక్షన్‌ మహిళల రక్షణకు ఉద్దేశించింది ఎంత మాత్రం కాదు. పెళ్లి అనే సామాజిక వ్యవస్థలో మహిళల స్వతంత్రత, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పురాతనమైన ఇలాంటి చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది..’ అని విజయసాయిరెడ్డి  పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు