తండ్రికి తిండి పెట్టని ఘనత పురందేశ్వరిది

8 Nov, 2023 04:37 IST|Sakshi

వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

సాక్షి ,అమరావతి: ఎన్టీఆర్‌ ఇంటికి పది అడుగుల దూరంలో ఉండికూడా ఆయనకు ఏనాడు ఒక్క ముద్ద కూడా అన్నం పెట్టని ఘనత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిదని వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వయసు మీరిన సమయంలో అనారోగ్యంతో బాధ­పడుతున్న ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబుతో కలిసి అధికారాన్ని లాక్కున్న పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు చివరకు ఆయనను నిర్దాక్షిణ్యంగా కిందకు లాగి పడేశారని ధ్వజమెత్తారు. శత్రువుకు కూడా ఇలాంటి కూతుళ్లు పుట్టాలని ఎవరూ కోరుకోరని వ్యాఖ్యానించారు.
 
కేంద్రమంత్రిగా చేసిందేమిటి! 
ఎనిమిదేళ్లపాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి డబ్బు వ్యామోహంతో వ్యవహరించడం తప్ప దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. మానవ వనరుల, వాణిజ్య శాఖల సహాయ మంత్రిగా ప్రజలకు పనికొచ్చే ఏ చిన్న పని కూడా ఆమె చేయలేదన్నారు. ఆమె దృష్టంతా పైరవీలు, సంపాదనపైనే పెట్టారని పేర్కొన్నారు. పురందేశ్వరి ఎప్పుడూ కులం, కుటుంబం చుట్టే రాజకీయాలు చేస్తారన్నారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఆమె ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే అని.. ఆమె అంతిమ లక్ష్యం కుల ఉద్ధరణేనని పేర్కొన్నారు.

పురందేశ్వరికి సిద్ధాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజ హితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏవీ లేవని మండిపడ్డారు. పురందేశ్వరి ఒకసారి పోటీ చేసిన స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగరన్నారు. వైఎస్సార్‌ హవాలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై బాపట్ల, విశాఖపట్నంలో బయటపడ్డారని, బీజేపీలో చేరాక రాజంపేట నుంచి పోటీ చేసి 1.75 లక్షల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు