విజయవాడ–దుబాయ్‌ ఫ్లైట్‌కు స్పందన నిల్‌

15 Feb, 2019 08:48 IST|Sakshi

సర్వీసు నడిపేందుకు ముందుకురాని విమానయాన సంస్థలు

సాక్షి, అమరావతి: వీజీఎఫ్‌ స్కీం కింద అమ్ముడు కాని టికెట్లకు డబ్బులు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినా విజయవాడ–దుబాయ్‌ల మధ్య విమాన సర్వీసులు నడపడానికి ఏ ఒక్క విమానయాన సంస్థ ముందుకు రాలేదు. వీజీఎఫ్‌ స్కీం కింద విజయవాడ– దుబాయ్‌ మధ్య సర్వీసులు నడపడానికి ఆసక్తి గల సంస్థల నుంచి ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)ను పిలిచింది. ఈ రెండు నగరాల మధ్య వారానికి రెండు సార్లు విమాన సర్వీసులు నడపాలని, భర్తీ కాని సీట్లకు ప్రభుత్వం వీజీఎఫ్‌ స్కీం కింద నగదు చెల్లిస్తుందని తెలిపింది.

ఇందుకు ఫిబ్రవరి 12 చివరి తేదీగా నిర్ణయించగా ఏ ఒక్క సంస్థ నుంచి దరఖాస్తు రాలేదని దీంతో బిడ్డింగ్‌ గడువు 26 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఏడీసీఎల్‌ ఎండీ, సీఈవో వీరేంద్ర సింగ్‌ తెలిపారు. అంతే కాకుండా దుబాయ్‌కు అంతగా స్పందన లేకపోవడంతో ఈసారి అబుదాబీకి కూడా అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటికే వీజీఎఫ్‌ తరహాలో సింగపూర్‌కు విమాన సర్వీసులు నడుపుతున్న సంగతి తెలిసిందే. విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు నడపడానికి ముందుకొచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆరు నెలల కాలానికి ప్రభుత్వం రూ.18.36 కోట్లు చెల్లించనుందన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు