‘వీఐపీ అయినా క్యూలైన్లో రావాల్సిందే’

13 Oct, 2018 16:58 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం(అక్టోబర్‌ 14) రోజు మూలా నక్షత్రం సందర్బంగా సరస్వతీ దేవీ అవతారంలో కనకదుర్గమ్మను అలంకరించనున్నారు. ప్రతి యేటా మూడు లక్షల మందికి పైగా భక్తులు మూలా నక్షత్రం నాడు అమ్మవారిని దర్శించుకుంటారు. దీంతో రేపటి ఉత్సవాల నిర్వహణ గురించి దుర్గ గుడి ఈవో వి. కోటేశ్వరమ్మ పాలకమండలి సభ్యులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. 

మూలా నక్షత్రం సందర్భంగా భక్తులకు అంతరాయల దర్శనం ఇవ్వలేమని తెలిపారు. ముఖమండప దర్శనానికి రూ.100 టికెట్‌ పెడుతున్నామని, రేపు ఏ వీఐపీని ప్రత్యేకంగా చూడమని స్పష్టం చేశారు. వీఐపీ అయినా క్యూలైన్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేషనల్‌ లెవెల్‌ వీఐపీలకు తప్ప ఎవరికీ ప్రత్యేక దర్శనం లేవని పేర్కొన్నారు. అందరూ క్యూలైన్లో నిలబడితే అమ్మ వారి సేవ చేసినట్టేనని వివరించారు. పాలకమండలి మధ్య విభేదాలు ఇంట్లో కుటుంబసభ్యుల గొడవలాంటిదన్నారు. పాలకమండలి సభ్యులు కూడా టికెట్లు కొనేల చర్యలు చేపడతామన్నారు. దుర్గమ్మ గుడి పవిత్రతను కాపాడాలని, రాజకీయ పార్టీల ప్రచారాలకు తావులేదని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు