కడలి కల్లోలం

13 Oct, 2013 04:20 IST|Sakshi

నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: పెనుతుపాన్ పై-లీన్ ప్రభావంతో జిల్లాలోని తీరప్రాంతంలో అలజడి రేగింది. సముద్ర అలలు భీకరంగా ఎగిసిపడటంతో పలు చోట్ల తీరం కోతకు గురైంది. ఎట్టకేలకు తుపాన్ శనివారం రాత్రి  తీరం దాటినా, జిల్లాపై పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అధికారులతో పాటు ప్రజలందరూ ఊపిరిపీల్చుకున్నారు. ముప్పు తప్పినా అధికారులు అనుక్షణం అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. పై-లీన్ ప్రభావం జిల్లాపైనా చూపే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
 
 కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద సూచిక ఎగురవేశారు. ఈ క్రమంలోనే శనివారం వేకువజాము నుంచే సముద్రం కల్లోలంగా మారింది. ఎప్పుడూలేని విధంగా అలలు ఎగిసిపడ్డాయి. కావలి, బోగోలు, ఇందుకూరుపేట మండలంలోని పలు చోట్ల సముద్రం 20 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. అలల తీవ్రతకు కొన్ని చోట్ల తీరం కోతకు గురైంది. బోగోలు మండలంలోని తాటిచెట్లపాళెం వద్ద అలల ఉధృతికి పది వలలు ఇసుకలో కూరుకుపోయాయి.  ఈ క్రమంలో తుపాన్ తీరం దాటే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా వాసులు ఆందోళనకు గురయ్యారు.
 
 తీరానికి దగ్గరగా వెనామీ రొయ్యలసాగు చేపట్టిన రైతులు పలువురు హడావుడిగా రొయ్యలు పట్టేశారు. సాయత్రం 6.25 గంటల సమయంలో తుపాన్ శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటిందని సమాచారం రావడంతో అందరూ హమ్మయ్యా అనుకున్నారు. అయినా తుపాన్ ప్రభావం మరికొద్ది గంటలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. 21 మండలాల్లో నియమితులైన 23 మంది ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయా ప్రాంతాల్లోని డిపోల్లో ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచారు.
 
 అప్రమత్తంగా ఉన్నాం: కలెక్టర్ శ్రీకాంత్
 పై-లీన్ తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని జిల్లాలోని అధికారులందరినీ ఆదేశించామని కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. శనివారం రాత్రి ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ప్రత్యేకాధికారులంతా వారికి కేటాయించిన ప్రాంతాల్లో బస చేస్తున్నారన్నారు. గ్రామస్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
 
 విద్యుత్ అధికారుల అప్రమత్తం
 నెల్లూరు(దర్గామిట్ట): తుపాన్ నేపథ్యంలో జిల్లాలోని తీరప్రాంత విద్యుత్‌శాఖ అధికారులను ఎస్‌ఈ నందకుమార్ అప్రమత్తం చేశారు. కొందరికి రెవెన్యూ అధికారులకు సహకారం అందించే బాధ్యతలు అప్పగించారు.
 

మరిన్ని వార్తలు