లిస్టులు రెడీ

3 Mar, 2014 05:19 IST|Sakshi

 రాజమండ్రి : ఓ వైపు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల రణభేరి మోగనుండగా.. మరోవైపు ‘పురపోరు’ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఆ శాఖ అధికారులు ఆదివారం ఓటర్ల తుది జాబితాల్ని విడుదల చేశారు.

ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సుదీర్ఘ కసరత్తు జరిపిన అనంతరం.. డివిజన్‌ల పునర్వ్యవస్థీకరణ జరగని కాకినాడ మినహా రాజమండ్రి నగరం, మున్సిపల్ పట్టణాలు, నగర పంచాయతీల్లో డివిజన్‌ల వారీ ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసే పని చేపట్టారు. మండపేట, రాజమండ్రి మినహా మిగిలిన పట్టణాలకు సంబంధించి డివిజన్లవారీ తుది జాబితాలు రాత్రి పది గంటలకు సిద్ధమయ్యాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం రాజమండ్రి నగరంలో, మిగిలిన పట్టణాల్లో ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 5,40,507 మంది ఓటర్లలో పురుషులు 2,66,692 మంది ఉండగా స్త్రీలు 2,73,815 మంది ఉన్నారు రాజమండ్రి నగరపాలక సంస్థ, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో పోలింగ్ నిమిత్తం 489 బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. మున్సిపాలిటీల్లో 2013 జనవరి ఒకటి నాటికి జరిగిన ఓటర్ల గణన ఆధారంగా గత ఏడాది ఆగస్టులో ప్రచురించిన జాబితా ప్రకారం జిల్లాలో 4,75,176 మంది ఓటర్లు ఉన్నారు. వారి సంఖ్య 2014 జనవరి ఒకటి నాటికి 65,331 మేర పెరిగింది.

 రాజకీయ పక్షాల్లో నిరాసక్తత..:  అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ రాజకీయ పక్షాలు మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఈ నెల ఏడు నుంచి సాధారణ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘం సిద్ధం అవుతున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికలు జరగకపోవచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పుడే ఎన్నికలపై ఎటువంటి చర్యలు చేపట్టదలచుకోలేదని రాజమండ్రి సహా పలు ప్రాంతాల టీడీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. కాంగ్రెస్‌లో నేతలే కరువయ్యారు. ఇతర పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలకు ఇది సమయం కాదని అభిప్రాయపడుతున్నాయి.  
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా