పంచాయతీ ఎన్నికలకు కసరత్తు

13 May, 2018 13:34 IST|Sakshi
ఎస్‌ఈసీ ఉత్తర్వుల మేరకు ఎన్నికల ప్రక్రియలో తలమునకలవుతున్న పంచాయతీ సిబ్బంది

అసెంబ్లీ ఓటర్ల జాబితాను అనుసరించి రూపకల్పన

ఈ నెల 15న ఓటర్ల జాబితా ప్రచురణకు సన్నాహాలు

జూలై 31 నాటికి పూర్తి చేయాలని ఎస్‌ఈసీ ఉత్తర్వులు

సాక్షి, కర్నూలు(అర్బన్‌):  గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది జూలై 31 నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆగస్టు 1వ తేదీతో పంచాయతీ సర్పంచుల ఐదేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పదవీ కాలం పూర్తి అయ్యే నాటికి ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని కమిషన్‌ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.

అయితే ఎన్నికలను సకాలంలో నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇటీవలే రూపొందించిన అసెంబ్లీ ఫొటో ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకొని గ్రామ పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య, పోలింగ్‌ కేంద్రాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరింది. ముఖ్యంగా (రిజర్వేషన్ల అమలులో భాగంగా)  గ్రామ పంచాయతీల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా లెక్కించి ఆయా జాబితాల్లో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీల్లో అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా సరిచూడడం వంటి కార్యాక్రమాలను పూర్తి చేసేందుకు ఇప్పటికే ఈఓఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టారు.  

ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం

  • మే 15న గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల వివరాలను ప్రదర్శించాలి.  
  • జూన్‌ 25న గ్రామ పంచాయతీల్లో సర్పంచు, వార్డు సభ్యులు, మహిళా రిజర్వేషన్లు పూర్తి చేసి తుది ప్రతిపాదనలను రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలకు పంపాలి. బ్యాలెట్‌ పేపర్లతో పాటు ఎన్నికల సామగ్రికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలి.  
  • జూన్‌ 30 నాటికి హ్యాండ్‌ బుక్స్, ఫామ్స్, కవర్ల ప్రింటింగ్‌ పూర్తి కావాలి.  
  • ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకముందే ఎన్నికల నియమావళిపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు, శాంతిభద్రతల పరిరక్షణ, మద్య నిషేధం, ఆర్థిక శాఖలకు సంబంధించిన అధికారులతోనూ సమావేశాలు నిర్వహించాలి.   
మరిన్ని వార్తలు