వైఎస్సార్సీపీ వైపే ఓటరు చూపు

2 Mar, 2017 11:30 IST|Sakshi
వైఎస్సార్సీపీ వైపే ఓటరు చూపు
► వెన్నపూస గోపాల్‌ రెడ్డి, గౌరు వెంకటరెడ్డిల విజయం తథ్యం
► కర్నూలు ఎంపీ బుట్టా రేణుక 
 
వెల్దుర్తి రూరల్‌ : 
త్వరలో జరుగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు చూపు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల వైపే ఉందని కర్నూలు ఎంపీ బుట్టారేణుక అన్నారు. బుధవారం చెరుకులపాడు గ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చెరుకులపాడు నారాయణరెడ్డి స్వగృహంలో పార్టీ మండల ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు.
 
ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి గోపాల్‌రెడ్డి, స్థానిక సంస్థల అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిల విజయం తథ్యమన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన టీడీపీని ఓటర్లు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎన్నికల్లో  ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. 
 
అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ నేతలు..
ప్రజా సమస్యలను టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదని ఎంపీ బుట్టా రేణుక ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ఆ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామాభివృద్ధికి రూ.70లక్షల నిధులు మంజూరు చేశానని, అలాగే దత్తత తీసుకున్న నందవరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో జిల్లాలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. నిరుద్యోగుల కోసం జాబ్‌ మేళాలు, విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తున్నామన్నారు. కర్నూలులో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం ఏర్పాటుకు కృషి చేశానని చెప్పారు. టెక్స్‌టైల్స్‌ పార్క్, రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే రిజర్వేషన్‌ సెంటర్ల పెంపు, పలు స్టేషన్‌లలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల నిలుపుదల..ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కర్నూలు, మంత్రాలయం రైల్వేలైన్‌ సర్వే కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విజయం సాధించామని పేర్కొన్నారు.  కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో నీటి ఎద్దడి నివారణ కృషి చేస్తున్నట్లు తెలిపారు. వెల్దుర్తిలో నీటిసమస్య పరిష్కారానికి తన వంతు సహాయం అందిస్తానని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల కన్వీనర్‌ రవిరెడ్డి, పట్టణ కన్వీనర్‌ వెంకట్‌నాయుడు, గోవర్ధనగిరి, శ్రీరంగాపురం ఎంపీటీసీ సభ్యులు గోపాల్, సుంకిరెడ్డి, మండల నాయకులు రత్నపల్లె రమణారెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, అగస్టీన్, ఆరీఫ్, ఆటో మోహన్, చెరుకులపాడు మోహన్‌ పాల్గొన్నారు.   
 
బోర్ల వినియోగంలో రాజకీయం తగదు
 ఎంపీ నిధుల ద్వారా వేసిన బోర్లు వినియోగించడంలో రాజకీయం చేయడం తగదని టీడీపీ నాయకులకు ఎంపీ బుట్టా రేణుక సూచించారు. కోయిలకొండ గ్రామ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు మండ్ల మాదేవి కుమారుని వివాహ వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ఎంపీ నిధులతో చాలా బోర్లు వేశామని, అన్నింటిలో నీరు పడిందన్నారు. కోయిలకొండలో వేసిన బోరుకు పంచాయతీ వారు పైపులైన్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కృష్ణగిరి మండలంలో కటారుకొండ, జి.మల్లాపురం గ్రామాల్లో ఎంపీ నిధుల ద్వారా వేసిన బోర్లతో తాగునీరు అందుతోందన్నారు.
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పట్టభధ్రులు, స్థానిక సంస్థల అభ్యర్థులు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు వెన్నపూస గోపాల్‌ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి గెలుపునకు అందరూ కృషిచేయాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని ఆరోపించారు. ఇదే మంచి తరుణమని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ ఆర్‌బీ వెంకటరాముడు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు నక్క నాగరాజు,  సుదర్శనాచారి, తిరుపాల్‌యాదవ్, రైతు సంఘం నాయకులు జయరామిరెడ్డి, బాలు, మండ్ల కృష్ణమూర్తి, రామచంద్రుడు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు