చినుకు పడదే..!

19 Jun, 2014 04:19 IST|Sakshi
చినుకు పడదే..!

 సాక్షి, నెల్లూరు: వాన కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. జూన్ ముగుస్తున్నా ఎండలు మండిపోతున్నాయి. చినుకు రాలక మేఘాలు చాటేస్తున్నాయి. చెరువులు ఎండాయి. జలాశయాల్లో నీటి మట్టం తగ్గింది. మెట్ట ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో తాగునీరు అందక జనం నానా అవస్థ  పడుతున్నారు. జూన్‌లో 56 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 5.6 మి.మీ. మాత్రమే నమోదైంది. దీంతో సోమశిల పరిధిలో లేట్ ఖరీఫ్ సైతం ఆశించిన స్థాయిలో సాగుకు నోచుకోలేదు. మరోవైపు జిల్లావాసులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు.

పదును వాన కురిస్తే జిల్లా వ్యాప్తంగా వేలాది హెక్టార్లలో జీలుగ, జనుము, పిల్లిపెసర, కంది, పెసర తదితర పంటలు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు 50 శాతం సబ్సిడీతో  విత్తనాలను సిద్ధం చేసి ఉంచారు. ఎరువులను కూడా తగిన మోతాదులో సిద్ధంగా ఉంచినట్టు అధికారులు  చెబుతున్నారు. వర్షాలు కురిస్తే జిల్లా వ్యాప్తంగా 65 వేల హెక్టార్లలో పంటలు సాగుకానున్నాయి. 30 వేల హెక్టార్లలో జీలుగ, జనుము, పిల్లిపెసర, 1500 హెక్టార్లలో కంది, 900 హెక్టార్లలో సజ్జ, 170 హెక్టార్లలో మొక్కజొన్న, 5 వేల హెక్టార్లలో పత్తి  తదితర పంటలు సాగుకానున్నాయి. ఇప్పటికే 12 వేల క్వింటాళ్లు జీలుగ, 3,500 క్వింటాళ్లు జనుము, 5 వేల క్వింటాళ్లు పిల్లిపెసర, 200 క్వింటాళ్లు కంది ,150 క్వింటాళ్లు పెసర విత్తనాలను అధికారులు సిద్ధం చేశారు.  

ఈ నెల 6న వింజమూరు, దుత్తలూరు, ఆత్మకూరు, డక్కిలి, బాలాయిపల్లి ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లులు కురిశాయి. గత కొద్దిరోజులుగా  ఆకాశంలో మబ్బులు వస్తున్నా చినుకు మాత్రం రాలడంలేదు. ఈ నెల చివరి నాటికైనా మంచి వర్షం కురవకపోతు రైతులకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 1800 చెరువులు ఎండిపోయాయి. శ్రీశైలం, కండలేరు జలాశయాల్లో నీటిమట్టం తగ్గుతోంది. ఈ పరిస్థితిలో  సకాలంలో వర్షాలు కురవకపోతే జిల్లాలో పూర్తిస్థాయిలో పంటలు సాగయ్యే అవకాశంలేదు. ఇక జిల్లాలో డెల్టాప్రాంతాన్ని పక్కన బెడితే మెట్టప్రాంతాల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి తదితర ప్రాంతాల రైతులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

ఇప్పటికే ఇక్కడ భూగర్భజలాలు అడుగంటాయి. బావులు ఎప్పుడో ఎండిపోయాయి. వర్షం సకాలంలో కురవక పోతే ఖరీఫ్‌సాగు సంగతి దేవుడెరుగు  తాగునీటికి ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే జిల్లాలో వెంకటగిరి, ఉదయగిరి, కావలి, గూడూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో సాగులో ఉన్న అరటి,  నిమ్మ, మామిడి, సజ్జ, పత్తి తదితర పంటలు వర్షంలేక ఎండుతున్నాయి. ఈ పరిస్థితిలో అన్నదాతలు వానల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు జిల్లా రైతాంగంలో ఆందోళన నెలకొంది. ఎన్నికల ముందు రుణమాఫీ అన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మెలికపెట్టి  రుణమాఫీ అమలును తుంగలో తొక్కే ప్రయత్నానికి దిగాడు.

ఈ నేపథ్యంలో రైతులకు ఖరీఫ్ రుణాలు సకాలంలో కాదుకదా అసలు అందేలా కనిపించడంలేదు. పాతరుణాలు చెల్లిం చందే బ్యాంకులు తిరిగి రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండదు.  మరోవైపు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు రైతులపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఈ సారి వ్యవసాయం సక్రమంగా సాగుతుందా అన్న అనుమానాలు  అందరిలోనూ నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు