ముగిసిన ప్రహసనం

16 Jun, 2014 01:07 IST|Sakshi
ముగిసిన ప్రహసనం

అమలాపురం :గోదావరి డెల్టా ప్రధాన పంట కాలువలకు అధికారులు అన్న సమయానికే నీరు విడుదల చేశారు. ఇక రైతులు ఖరీఫ్‌కు నారుమడులు వేయడమే ఆలస్యం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడున్న పంట, మురుగు కాలువల పరిస్థితి చూస్తుంటే ఒకవైపు పొలాలకు నీరు సక్రమంగా అందే అవకాశం లేకపోగా, మరోవైపు ముంపునీరు దిగే పరిస్థితి కనిపించడం లేదు. కోట్లాది రూపాయలతో చేపట్టిన ఆధునికీకరణ పనులు ఈ ఏడాది కూడా నామమాత్రంగానే జరగడంతో శివారు భూములకు సాగు, ముంపునీరు ఇక్కట్లు తప్పేటట్టు లేవు. జిల్లాలో   గోదావరి డెల్టా కాలువల ఆధునికీకరణ పనులు సుమారు రూ.1,160 కోట్లతో జరగాల్సి ఉంది. గడచిన ఆరేళ్లలో ఇంతవరకు రూ.250 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది రూ.150 కోట్లతో పనులు చేపడతామని ప్రకటించిన అధికారులు వాటిని కేవలం రూ.50 కోట్లకు మాత్రమే పరిమితం చేశారు. దీనిలో మురుగునీటి కాలువలకు రూ.30 కోట్లు, తూర్పు, మధ్యడెల్టాల్లో పంట కాలువలకు రూ.పది కోట్ల చొప్పున పనులు చేశారు. డ్రైన్లలో పూడికతీత పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కాలువలపై చేపట్టిన కొద్దిపాటి పనులు కూడా ఇంకా పూర్తికాకున్నా క్లోజర్ సమయం పూర్తయ్యిందని చెప్పి అధికారులు నీరు విడుదల చేసేశారు.         
 
 ఉపాధి పనులే దిక్కు
 గోదావరి డెల్టాలో ప్రధాన పంట కాలువలు, చానల్స్, పంటె బోదెలు పూడుకుపోయి శివారుకు సాగునీరందని పరిస్థితి ఉంది. చాలాచోట్ల కాలువలు మట్టితో పూడుకుపోయాయి. వీటిలో పూడిక తొలగించలేదు. 2009లోనే ఈ పనులు పూర్తి చేసినందున కొత్తగా చేపట్టలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో పూడికతీత పనుల్లో చోటు చేసుకున్న అవినీతి పుణ్యమాని రెండేళ్లకే కాలువలు పూర్వపు స్థితికి చేరుకున్నాయి. కేవలం ఉపాధి నిధులతోనే అక్కడక్కడా చేపడుతున్న నామమాత్ర పనులే దిక్కయ్యాయి. ఇప్పుడు చేస్తున్న ఆధునికీకరణ పనులు కూడా డీపీ (డెరైక్టు పైప్)లు, కల్వర్టులు వంటి చిన్నచిన్న నిర్మాణాలే. ఈ నిర్మాణాల వల్ల నీటిఎద్దడి తీరే అవకాశం లేదు.
 
 చేసింది స్వల్పమే  
 డెల్టా ఆధునికీకరణ పనులను తొమ్మిది ప్యాకేజీలుగా విభజిస్తే ఇప్పటి వరకు కేవలం ఐదు ప్యాకేజీల్లో పనులకు మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. మిగిలిన పనులను 16 చిన్న ప్యాకేజీలుగా చేయగా రెండు పనులకు మాత్రమే టెండర్లు పడ్డాయి. సుమారు రూ.650 కోట్ల పనులకు టెండర్లు ఖరారు కాగా, రూ.250 కోట్ల పనులు కూడా పూర్తి కాలేదు. ఈ ఏడాది తొలుత రూ.150 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపడతామన్న అధికారులు ఆ పనులను కేవలం రూ.50 కోట్లకే పరిమితం చేశారు.
 
 చిత్తశుద్ధి లేకనే
 ఇరిగేషన్ అధికారులకు చిత్తశుద్ధి లేకనే ఆధునికీకరణ పనులు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రబీకి క్రాప్ హాలీడే ప్రకటించి లాంగ్ క్లోజర్ ఇస్తే (ఆరు నెలలు) ఆధునికీకరణ పనులు చేయడానికి వీలవుతుందని ప్రతిఏటా అధికారులు వాదిస్తూ వస్తున్నారు. అయితే  డెల్టా ఆధునికీకరణ పనుల నుంచి లాకులు, వంతెనల నిర్మాణం వంటి పనులు మినహాయించారు. నిర్మాణానికి సంబంధించి డీపీలు, రిటైనింగ్ వాల్స్ వంటి పనులు మాత్రమే ఉన్నాయి. ఆ పనులకు లాంగ్‌క్లోజర్ ప్రకటించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ‘కాలువలపై చేపట్టే నిర్మాణాలు ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫుల్ సప్లయి లెవెల్) వరకు కట్టుకుంటే తరువాత సాగునీరు విడుదల చేసినా వాటిపై పనులు పూర్తి చేసే అవకాశముంది’అని రిటైర్డ్ ఈఈ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు. ఇందుకు షార్ట్‌క్లోజర్ 45 రోజుల సమయం ఎక్కువేనని ఆయన చెబుతున్నారు. కోనసీమ తీర ప్రాంత మండలాల్లో నిత్యం నీరు పారాలి.. లేకుంటే అవి చౌడుబారిపోతాయి. ఇటువంటి  చోట్ల లాంగ్‌క్లోజర్ ప్రకటించే అవకాశం కూడా లేదనే విషయాన్ని అధికారులు గుర్తించి ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కాంక్రీట్ నిర్మాణ పనుల్లో పెద్దగా మిగిలే అవకాశం లేనందున ఈ పనులను అటు కాంట్రాక్టర్లు, ఇటు ఇరిగేషన్ అధికారులు పక్కనబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 

>
మరిన్ని వార్తలు