జనసేన కేడర్‌కు, పవన్‌కు వార్‌

10 Dec, 2023 20:32 IST|Sakshi

పాలకొల్లు సెంట్రల్‌: ప్రస్తుతం జనసేన కేడర్‌కు, పవన్‌కళ్యాణ్‌కు మధ్య వార్‌ జరుగుతోందని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పవన్‌ ఓట్లు కావాలంటారు.. జనసేన నాయకులు అధికారం కావాలంటారు. ఏది ముందు ఏది వెనుక అని విశ్లేషిస్తే జేజేలు, చప్పట్లు కాదు కావాల్సింది ఓట్లు అని పవన్‌కళ్యాణ్‌ అంటున్నారు.. ఓట్లు సరే అధికారం సంగతేంటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.

ఓట్లు వేసి జనసేనను గెలిపిస్తే అధికారం అదే వస్తుందని పవన్‌ అంటుంటే.. అధికారం వస్తుందని నమ్మిస్తే ఓట్లు అవే వస్తాయని జనసేన నేతలు అంటున్నారు. తాను కోరుకుంటున్నది అధికారం కాదని, రాష్ట్ర శ్రేయస్సు, ప్రజాశ్రేయస్సు అని పవన్‌ అంటుంటే.. అధికారం చేజిక్కకుండా ప్రజాశ్రేయస్సు ఎలా సాధిస్తారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు..’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం జనసేన కేడర్, పవన్‌కు మధ్య జరుగుతున్న వార్‌ ఇదని తెలిపారు. 

తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టడంలో ఆఖరి వరుసలో ఉందని సర్వేలు చెబుతున్నా తన సత్తా చూపించాలనే ఆతృతతో బీజేపీతో కలిసి పవన్‌ ఎన్నికల రంగంలోకి దిగడం సాహసోపేతమని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టలేదని తెలిసీ ఓటర్లు తమ ఓట్లను జనసేన–బీజేపీ కూటమికి వేసి ఎందుకు చేతులు కాల్చుకుంటారని ప్రశ్నించారు. ఏపీలో పరిస్థితి మాత్రం వేరని తెలిపారు.

పవన్‌ 60 శాసనసభ సీట్లకు తక్కువ కాకుండా పోటీచేయవచ్చని పేర్కొన్నారు. అధికారం దక్కించుకోవడం పవన్‌ వంతు అయితే.. జనసేన–టీడీపీ కూటమికి ఓట్లు వేసి నెగ్గించుకోవడం తమ వంతు అని జనసేన కేడర్‌ దృఢ సంకల్పంతో ఉందని తెలిపారు. జనసేన టీడీపీని కలుపుకొని వైఎస్సార్‌సీపీని ఓడించి రాజ్యాధికారం దక్కించుకోవడానికి, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దగ్గరలో ఉందని తెలిపారు. టీడీపీ వెనుక జనసేన అని కాకుండా.. జనసేన వెంట టీడీపీ ఉందని చెప్పి మూడునెలల్లో అధికారంలోకి రావడం తథ్యమని ప్రజలను నమ్మించగలగాలని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్‌మెయిల్‌?

>
మరిన్ని వార్తలు